హైదరాబాద్, వెలుగు: సిమెంట్ బోర్డులు, సోలార్ రూఫ్‌లు, యార్న్ వంటి వివిధ ప్రొడక్ట్‌లను తయారు చేసే హైదరాబాద్ కంపెనీ విశాక ఇండస్ట్రీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 400.87 కోట్ల రెవెన్యూ (కన్సాలిడేటెడ్) సాధించింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1) లో నమోదైన రూ. 591.85 కోట్ల నుంచి తగ్గినా, గత ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన రూ. 326.28 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగింది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్–-సెప్టెంబర్) కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 992.72 కోట్లకు చేరింది. విశాక ఇండస్ట్రీస్‌కు క్యూ2లో రూ. 71.30 కోట్ల నికర లాభం రాగా, గత ఏడాది ఇదే క్వార్డర్లో రూ. 8.72 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. జూన్ క్వార్డర్లో రూ. 52.67 కోట్ల లాభాన్ని సాధించింది. కంపెనీకి ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 123.97 కోట్ల నికర లాభం రాగా, గత ఏడాది ఇదే టైమ్‌లో వచ్చిన రూ. 43.42 కోట్లతో పోలిస్తే భారీ వృద్ధి నమోదు చేసింది.
మొత్తంగా చూస్తే, గత ఏడాదితో పోలిస్తే విశాక ఇండస్ట్రీస్ ఆదాయం, లాభాలు భారీగా పెరిగాయి. నష్టాల నుంచి లాభాల బాట పట్టడంతో పాటు ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో బలమైన ఆర్థిక పనితీరును కనబరిచింది. విశాక ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం 2.17 శాతం నష్టపోయి రూ.86.85 వద్ద ముగిశాయి.
