ఏడు కన్నా తక్కువ అండాలిస్తే కమీషన్లో 50 శాతం కోత...ఏజెంట్లతో అగ్రిమెంట్లు, టార్గెట్లు..హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్ల దందా..!

ఏడు కన్నా తక్కువ అండాలిస్తే కమీషన్లో 50 శాతం కోత...ఏజెంట్లతో అగ్రిమెంట్లు, టార్గెట్లు..హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్ల దందా..!
  • సద్గురు హెల్త్‌‌‌‌ కేర్, ఒయాసిస్, ఇతర ఫెర్టిలిటీ సెంటర్లలో అండాల దందా
  • యువతులకు ఒక్కో అండానికి రూ.50 వేలు ఆశ చూపిన ఏజెంట్లు
  • 66 మంది నుంచి అండాల సేకరణ రికార్డుల్లో 47 మంది వివరాలే..
  • డీఎంహెచ్‌‌‌‌వో ఫిర్యాదుతో మలక్‌‌‌‌పేటలో కేసు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రాలకు చెందిన యువతులకు ఒక్కో అండానికి రూ.50 వేల ఆశ చూపి అండాలను సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 

హైదరాబాద్​ డీఎంహెచ్​వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒయాసిస్, సద్గురు ఫెర్టిలిటీ సెంటర్లపై మలక్‌‌‌‌పేట పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా గచ్చిబౌలి, ఉప్పల్‌‌‌‌, మలక్‌‌‌‌పేట, టోలిచౌకిలోని క్లినిక్‌‌‌‌లకు అండాలు సరఫరా అవుతున్నట్లు తేల్చారు.  నిందితులు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్‌‌‌‌ కలిసి ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ చివరి నాటికి మొత్తం 66 మంది యువతుల నుంచి అండాలు సేకరించారని పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు.

ఏజెంట్​కు గరిష్ఠంగా రూ.65 వేలు

మలక్‌‌‌‌పేటలోని సద్గురు హెల్త్‌‌‌‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌కు చెందిన డాక్టర్ గెడెల దుర్గారావు వద్దకు అండాల సేకరణ కోసం మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువతులను తీసుకెళ్లారు. దీనికి గానూ వీరి ప్రయాణం, వసతి, భోజన ఏర్పాట్లు ఏజెంట్ల బాధ్యతగా అగ్రిమెంట్లు రాసుకున్నారు. 

ఒక్కో మహిళకు సంబంధించి ఏజెంట్‌‌‌‌కు గరిష్ఠంగా రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఏడు కన్నా తక్కువ అండాలు సేకరించినా లేదా వాటి నాణ్యత తక్కువగా ఉన్నా చెల్లింపులో 50 శాతం కోత విధించే నిబంధన పెట్టారు. ఆరో రోజు కంటే ముందే హార్మోన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ నిలిపివేస్తే ఎలాంటి చెల్లింపులు ఉండవని పేర్కొన్నారు.  

ఏఆర్‌‌‌‌టీ బ్యాంకు, 5 క్లినిక్‌‌‌‌లు

బంజారాహిల్స్‌‌‌‌లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌తో సహా కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సద్గురు హెల్త్‌‌‌‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఉన్న ఏఆర్‌‌‌‌టీ బ్యాంకు, ఒయాసిస్, సద్గురు పేర్లతో పనిచేస్తున్న 5 ఏఆర్‌‌‌‌టీ క్లినిక్‌‌‌‌ల ద్వారా అండాలను సప్లై చేసేవారు.  

రికార్డుల్లో లేని 19 మంది వివరాలు

ఏఆర్‌‌‌‌టీ బ్యాంకు రికార్డుల ప్రకారం.. ఈ ఏడాది 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 66 మంది డోనర్ల నుంచి అండాలు సేకరించగా.. బేగంపేట హాస్టల్‌‌‌‌లో పింకీ, షామ్లా(శ్యామల) శుక్లా, పూజాదేవి అనే యువతుల అండాలను గచ్చిబౌలి క్లినిక్‌‌‌‌కు పంపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ 66 మందిలో కేవలం 47 మంది డోనర్లకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా 19 మందివి లేవు. 

టోలిచౌకి, గచ్చిబౌలి, ఉప్పల్, మలక్‌‌‌‌పేట ప్రాంతాల్లోని క్లినిక్‌‌‌‌లకు ఏఆర్‌‌‌‌టీ బ్యాంకు నుంచి డోనర్లను కేటాయించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే, అగ్రిమెంట్లు మాత్రం మియాపూర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయి. ఈ వివరాలతో డీఎంహెచ్‌‌‌‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలక్‌‌‌‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

అండాల సేకరణపై మహిళా కమిషన్ విచారణ  

అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై మహిళా కమిషన్ శుక్రవారం విచారణ జరిపింది. నోటీసులు అందుకున్న 8 ఏఆర్‌‌‌‌టీ సెంటర్లు, అండాల బ్యాంకుల ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరయ్యారు. అయితే, సంస్థల యాజమాన్యాలు స్వయంగా రావాలని ఆదేశించినా, కొన్ని సెంటర్ల నుంచి సిబ్బంది మాత్రమే రావడంపై చైర్‌‌‌‌పర్సన్ నేరెళ్ల శారద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా సెంటర్ల రికార్డులు, డోనర్ల వివరాలను పరిశీలించారు. 90 శాతం మంది డోనర్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని, వారంతా ఎలాంటి డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా అండాలు దానం చేస్తున్నారని కేంద్రాలు పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. 

ఆరోగ్య శాఖ విచారణలో పురోగతి, ఏఆర్‌‌‌‌టీ చట్టం అమలులో ఉన్న లోపాలపై వైద్యారోగ్య శాఖ కమిషనర్ ముషారఫ్ ​అలీ ఫారుఖీతో చర్చించారు. అండాల సేకరణ వ్యవహారంపై కఠిన చర్యలు, చట్టపరమైన మార్పుల కోసం త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలవనున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే, అక్రమ అండాల సేకరణలో మరికొన్ని ఏఆర్‌‌‌‌టీ సెంటర్లు, అండాల బ్యాంకుల ప్రమేయం ఉన్నట్లు కీలక సమాచారం అందిందని, త్వరలోనే వాటి యాజమాన్యాలకు కూడా నోటీసులిస్తామని పేర్కొన్నారు.