సర్కారు దవాఖానాల్లో మందుల కొరత.. గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడే పాంటోప్రజోల్ కూడా నో స్టాక్

సర్కారు దవాఖానాల్లో మందుల కొరత.. గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడే పాంటోప్రజోల్ కూడా నో స్టాక్
  • కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన టెల్మిసార్టన్ సప్లై 
  • గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడే పాంటోప్రజోల్ కూడా నో స్టాక్ 
  • అంతంతమాత్రంగానే షుగర్ మందులైన మెట్‌‌ఫార్మిన్ సరఫరా 
  • టెండర్ల జాప్యంతో పెండింగ్‌‌లో రూ.9 కోట్ల ఎన్‌‌హెచ్‌‌ఎం ఆర్డర్లు
  • బయట మెడికల్ షాపుల్లో వందల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్న రోగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో మందుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా బీపీ కంట్రోల్ కు వాడే టెల్మిసార్టన్, గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇచ్చే పాంటోప్రజోల్ ట్యాబ్లెట్ల సప్లై గత కొద్ది రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది. గోలీల కోసం హాస్పిటల్ కు వెళ్తున్న రోగులు ఒట్టి చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు షుగర్ రోగులకు నిత్యం అవసరమయ్యే మెట్‌‌ఫార్మిన్ మందుల సప్లై కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌‌సీలు), అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (యూపీహెచ్‌‌సీలు), పల్లె, బస్తీ దవాఖానాల్లో మందులు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాల్లో ఆగిన పంపిణీ..

రాష్ట్రంలో 636 పీహెచ్‌‌సీలు, 249 యూపీహెచ్‌‌సీలు, 104 సీహెచ్‌‌సీలు, 76 జిల్లా, ఏరియా హాస్పిటల్స్, 35 టీచింగ్ హాస్పిటల్స్, 13 స్పెషాలిటీ, 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. వీటికి తోడు 4,695 సబ్ సెంటర్లలో అప్‌‌గ్రేడ్ అయిన 3,206 పల్లె దవాఖానాలు, 474 బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయి. సాధారణంగా ఆశా కార్యకర్తలు సమీప పీహెచ్‌‌సీలు, యూపీహెచ్‌‌సీల నుంచి బీపీ, షుగర్ మాత్రలు తీసుకొచ్చి గ్రామాల్లోని రోగులకు పంపిణీ చేస్తారు. హాస్పిటల్స్ కే సప్లై ఆగిపోవడంతో గ్రామాల్లోనూ పంపిణీ నిలిచిపోయింది.

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌హెచ్‌‌ఎం) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56.85 లక్షల మంది బీపీ, 47.96 లక్షల మంది షుగర్ బాధితులు ఉన్నారు. రోజూ మందులు వేసుకోవాల్సిన ఎన్‌‌సీడీ రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో వందల రూపాయలు వెచ్చించి బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

టెండర్ల జాప్యం.. ప్రత్యామ్నాయ చర్యలేవీ ?

ముడిసరుకు కొరత, ధరలు పెరగడంతో సరఫరాదారుల నుంచి సప్లై నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు టెండర్ ఖరారు చేసి ఆర్డర్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్‌‌హెచ్‌‌ఎం కింద సుమారు రూ.9 కోట్ల విలువైన మందుల ఆర్డర్లు పెండింగ్‌‌ లో ఉన్నాయి. కొత్త టెండర్లు పిలిచి, మందులు హాస్పిటల్స్ కు చేరడానికి ఒకటి నుంచి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

సెంట్రలైజ్డ్ సప్లైలో ఆలస్యం జరిగినప్పుడు అప్పటివరకు తాత్కాలిక పద్ధతిలో మందులను అందుబాటులోకి తెచ్చే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికారులు చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం పెండింగ్‌‌లో ఉన్న టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి, అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ మందులను అందుబాటులోకి తేవాలని రోగులు కోరుతున్నారు.

80 శాతం నిల్వలు ఏవీ..

రాష్ట్ర బడ్జెట్‌‌లో మందుల కేటాయింపులు 2023–24లో రూ.321.4 కోట్ల నుంచి 2025–26లో రూ.433.3 కోట్లకు (35 శాతం వృద్ధి) పెరిగాయి. మందుల శాస్త్రీయ నిల్వ, పంపిణీ కోసం 33 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ కే టీజీఎంఎస్‌‌ఐడీసీ ద్వారా ఏటా రూ.150 కోట్ల విలువైన మందులు సరఫరా చేస్తున్నట్లు గ్రాంట్ డిమాండ్ నోట్‌‌ లో వెల్లడించింది. అలాగే 2026–27 ఎన్‌‌హెచ్‌‌ఎం పరిధిలో మందుల కోసమే రూ.165.13 కోట్లు (యూపీహెచ్‌‌సీలు, బస్తీ దవాఖానాలకు రూ.60 కోట్లు, జిల్లా, సీహెచ్‌‌సీ ఎన్‌‌సీడీ క్లినిక్‌‌లకు రూ.33.70 కోట్లు సహా) ఆమోదం లభించింది.

పల్లె దవాఖానాల్లో 106, పీహెచ్‌‌సీల్లో 172 రకాల అత్యవసర మందుల్లో కనీసం 80 శాతం నిల్వలు ఉండాలని, డీవీడీఎంఎస్ ద్వారా స్టాక్‌‌ ను పర్యవేక్షించాలని ఎన్‌‌హెచ్‌‌ఎం రూల్స్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిత్యం వాడే మందులకు కొరత నెలకొనడం గమనార్హం.