- వాటి జారీకి ఆధారాలు చూపించాలి
- ఫ్యామిలీ ట్రీ, పూర్వీకుల ఎవిడెన్స్ మస్ట్
- అస్సాం మహిళను విదేశీయురాలిగా ప్రకటించిన గువహటి హైకోర్టు
గువాహటి: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని గువాహటి హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కార్డులను జారీ చేయడానికి ఉపయోగించిన ఆధార పత్రాలు, కుటుంబ సంబంధాలను నిరూపించే రికార్డులు కూడా సమర్పించాలని తేల్చిచెప్పింది. అస్సాంలోని దర్రాంగ్ జిల్లాకు చెందిన కుల్చన్ బేగం అనే మహిళను విదేశీయురాలిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. 1971 మార్చి 25 తర్వాత భారత్‌లోకి ప్రవేశించిన విదేశీయురాలిగా పేర్కొంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
13 పత్రాలు సమర్పించినా..
తన తల్లిదండ్రులు భారతీయులేనని, 1977 ఏప్రిల్ 25న తాను దర్రాంగ్ జిల్లాలోని లుయిట్‌పర్ లో జన్మించానని కుల్చన్ బేగం కోర్టులో పలు ఆధారాలతో వాదించారు. తన తాతయ్య, నానమ్మ పేర్లు 1966, 1970 నాటి ఓటర్ల జాబితాల్లో ఉన్నాయని తెలిపారు. తండ్రి పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, తన ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, 2018 ఓటర్ల జాబితా, ఎన్‌ఆర్‌సీ దరఖాస్తు రసీదు సహా 13 పత్రాలను కోర్టుకు సమర్పించారు. అయితే, వాటిని పరిశీలించిన కోర్టు.. ఆమె సమర్పించిన పత్రాలు పౌరసత్వాన్ని, తల్లిదండ్రులతో ఉన్న సంబంధాన్ని నిరూపించలేకపోయాయని అభిప్రాయపడింది.
తన తండ్రి అబు చంద్ మహమ్మద్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని, 2013లో గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేశారని కుల్చన్ బేగం పేర్కొన్నారు. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం, కౌన్సిలర్‌గా ఎన్నికవడం వల్ల ఆయనకు, కుల్చన్ బేగంకు మధ్య తండ్రి-, కుమార్తె సంబంధం నిరూపితం కాదని కోర్టు స్పష్టం చేసింది.
27 ఏళ్ల నివాసానికి ఆధారాలేవీ?
మహిళ పేర్కొన్న తండ్రి పేరు 1997 ఓటర్ల జాబితాలో తొలిసారి నమోదైందని, అప్పటికి ఆయన వయసు 50 ఏండ్లుగా ఉందని కోర్టు గుర్తించింది. 1970 నుంచి 1997 వరకు 27 ఏండ్లపాటు ఆమె తాతయ్య, నానమ్మ, తండ్రి అస్సాంలో నిరంతరంగా నివసించినట్లు ఆధారాలులేవని పేర్కొంది.
