- బదిలీ చేయడాన్నే శిక్షగా భావించొద్దు
- చేసిన నేరాలు, తప్పిదాలు చెరిగిపోవు
- మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు సంచలన ట్వీట్
బషీర్‌బాగ్, వెలుగు : హైదరాబాద్ సిటీ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్‌ను యూనిఫాంలో ఉన్న నేరస్తుడిగా పేర్కొంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఒక అధికారిని నేరస్తుడిగా విమర్శించడం తనకు బాధ కలిగిస్తున్నదంటూనే, వ్యక్తిగత స్నేహబంధాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
పోలీసు అధికారుల మధ్య ఉన్న సర్వీసు సంబంధాలు, స్నేహబంధాలు ప్రజా ప్రయోజనాల విషయంలో అడ్డంకిగా మారకూడదని అభిప్రాయపడ్డారు. కేవలం బదిలీ చేయడమే శిక్షగా భావించకూడదని, గతంలో జరిగిన నేరాలు, తప్పిదాలు బదిలీలతో చెరిగిపోవని వ్యాఖ్యానించారు. సజ్జనార్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అధికారులపై వచ్చే ఆరోపణల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని ఆయన ‘ట్వీట్’లో అభిప్రాయపడ్డారు.
