కుటుంబంలోఒకరికి జీవిత బీమా ..లబ్ధిదారుడు, నామినీల ఎంపిక కుటుంబ సభ్యులదే: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కుటుంబంలోఒకరికి జీవిత బీమా ..లబ్ధిదారుడు, నామినీల ఎంపిక కుటుంబ సభ్యులదే: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలులో లబ్ధిదారుల ఎంపిక, క్లెయిమ్ చేసుకునే నామినీల సంఖ్య విషయంలో కుటుంబ సభ్యులకే పూర్తి స్వేచ్ఛ ఉండేలా వెసులుబాటు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కుటుంబంలో ఒకరు ఉపాధి పొందుతుంటే ఆ వ్యక్తికి నేరుగా బీమా వర్తిస్తుందని, ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదించేవారు ఉంటే వారిలో ఎవరికి బీమా కల్పించాలనేది ఆ కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని తెలిపారు.

ఒకరిని లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కుటుంబమే నిర్దేశించుకోవచ్చని స్పష్టం చేశారు.శుక్రవారం సెక్రటేరియెట్​లో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా దేశంలోనే తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని, ఈ విప్లవాత్మక విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలవనుందని చెప్పారు.

వివరాల నమోదు సమయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారం నిర్వహించాలని, రిజిస్ట్రేషన్ కేంద్రాల వివరాలను ముందే ప్రకటించాలని సూచించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభంకానుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తింపజేస్తూ నిజమైన సార్వత్రిక రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేశారు.