- జనవరి 3 నుంచి 15 వరకు సీబీటీ మోడ్‌లో ఎగ్జామ్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్ – జనవరి 2027) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం టెట్ చైర్మన్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ జి.రమేష్వివరాలను వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల16 నుంచి డిసెంబర్ 10 వరకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఫిబ్రవరి 8 నుంచి 12 మధ్య ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. కాగా, ఎగ్జామ్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సింగిల్ పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950గా నిర్ణయించారు. పేపర్1కు ఇంటర్‌తో పాటు డీఈడీ/బీఈడీ/స్పెషల్ డీఈడీ పాసై ఉండాలి. పేపర్-2 కు ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ లేదా సంబంధిత లాంగ్వేజ్ ట్రైనింగ్ కోర్సులు పాసైన వారు అర్హులు. డీఈడీ, బీఈడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, గతంలో టెట్ క్వాలిఫై అయి స్కోర్ పెంచుకోవాలనుకునే వారితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అర్హతలు, సిలబస్, ఇతర పూర్తి వివరాలతో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈనెల 16 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. అభ్యర్థులకు ఏమైన సందేహాలుంటే టీజీటెట్ ఆఫీస్ ఫోన్ నెంబర్లు 7093708883 / 7093708884 కాల్ చేయాలని అధికారులు సూచించారు.
