- ఎల్‌నినో నేపథ్యంలో ఆర్థిక సాయం కోరతం
- భూగర్భ జలాలపై రాష్ట్రవ్యాప్తంగా యాక్షన్ ప్లాన్
- యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలపై రైతులకు అవగాహన
- ఇజ్రాయెల్ తరహాలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించి, కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, తాను ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితిపై శుక్రవారం సెక్రటేరియెట్‌లోని తన చాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు.
మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర, జిల్లా స్థాయి భూగర్భ జల శాఖాధికారులు, నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానితో జరిగే భేటీలో ప్రస్తావించేందుకు వీలుగా నీటి సంరక్షణ చర్యలపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ముప్పుతో భూగర్భ జలాలపై పడే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు చెప్పారు.
భూగర్భ జలాల రీచార్జ్‌ను పెంచడం, నీటి వెలికితీతను నియంత్రించడం, లభ్యమయ్యే నీటి వనరులను సుస్థిరంగా నిర్వహించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని వివరించారు. రాబోయే యాసంగి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాల లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేయడం, రీచార్జ్ చర్యలను బలోపేతం చేయడం, తక్కువ నీటితో పండే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
వర్షపు నీటి సంరక్షణకు ప్రణాళికలు..
భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. గ్రౌండ్ వాటర్ తగ్గుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వాన్ని ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దీనిపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని చెప్పారు.
భూగర్భ జల శాఖను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయెల్ వంటి దేశాలు కురిసిన ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి, పొదుపుగా వినియోగించుకుంటున్నాయని, తెలంగాణ కూడా అదే తరహా నీటి సంరక్షణ విధానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా తట్టుకునేలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను వ్యవస్థాగతం చేయాలని సూచించారు.
వాటర్‌షెడ్ స్థాయిలో మ్యాపింగ్..
భూగర్భ జల అంచనా కమిటీ (జీఈసీ) మోడల్‌ను ఉపయోగించి వర్షపాతానికి అనుగుణంగా భూగర్భ జలాల నిల్వలను వెంటనే అంచనా వేయాలని భూగర్భ జలాల నిపుణుడు, సీఎస్ఐఆర్- నార్త్ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ వీరేంద్ర ఎం.తివారీ సూచించారు. ప్రాథమిక అంచనాను కొన్ని రోజుల్లోనే పూర్తి చేయవచ్చని తెలిపారు.
తెలంగాణలో మొత్తం నీటి వినియోగంలో 94 శాతానికి పైగా సాగు నీటికే ఖర్చవుతుండగా, గృహ, ఇతర అవసరాలకు కేవలం 1.8 శాతం మాత్రమే వినియోగిస్తున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వాటర్‌షెడ్ స్థాయిలో భూగర్భ జలాల లభ్యత, అవసరాలను లెక్కించాలని స్పష్టం చేశారు. ప్రతి వాటర్‌షెడ్‌లో నీటి లభ్యతకు, సాగు నీటి అవసరాలకు మధ్య ఉన్న పరిస్థితిని మ్యాపింగ్ చేసి, ఆ ఫలితాల ఆధారంగా రైతులకు అనుకూలమైన పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.
తగినంత నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో వరి సాగు కొనసాగించవచ్చని, కానీ నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని రైతులను మొక్కజొన్న, చిరుధాన్యాలు (మిల్లెట్స్) వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. భూగర్భ జలాల పర్యవేక్షణపై ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
