- 5 రోజుల చార్జీతో నెల రోజులు ప్రయాణించే చాన్స్
- ఎంఎస్టీ పాస్‌లపై 9 రకాల అదనపు సౌకర్యాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. నెలవారీ సీజన్ టికెట్ల (ఎంఎస్టీ)పై 9 రకాల రాయితీలు, సౌకర్యాలు ప్రకటించింది. ముఖ్యంగా మహిళలు 15 రోజుల చార్జీ చెల్లించి నెలరోజులు ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యాలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎంఎస్టీ జారీకి ఉన్న దూర పరిమితిని తొలగించింది. టోల్ చార్జీలను 25 రోజులకు బదులు 20 రోజులకే పరిమితం చేసింది. కొత్తగా డీలక్స్ ఎంఎస్‌టీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్‌తో డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
పల్లెవెలుగు పాస్దారులు ఎక్స్‌ప్రెస్, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, ఎక్స్‌ప్రెస్ పాస్దారులు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో ఎంఎస్టీ ఉన్నవారు ఆదివారాల్లో అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పుష్పక్ బస్సులకు, ఇతర ప్రభుత్వ సెలవులకు ఈ సౌకర్యం వర్తించదు. బస్సులు మారి ప్రయాణించేందుకు రూ.20తో కాంబి టికెట్ అందుబాటులోకి తెచ్చింది.
ఇతర రూట్లలో సూపర్ లగ్జరీ, ఆపై స్థాయి బస్సుల టికెట్ చార్జీలపై 10 శాతం తగ్గింపు ఇవ్వనుంది. రెండు నెలల పాస్‌పై ఐదు రోజులు, మూడు నెలల పాస్‌పై పది రోజుల అదనపు గడువు కల్పించింది. మహిళలు 15 రోజుల చార్జీతో నెలరోజులు ప్రయాణించవచ్చని ఆర్టీసీ తెలిపింది.
