ఎర్రవల్లి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ చుట్టూ.. కేసీఆర్ ఫ్యామిలీ భూములు..ఆధారాలు బయటపెట్టిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

ఎర్రవల్లి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ చుట్టూ.. కేసీఆర్ ఫ్యామిలీ భూములు..ఆధారాలు బయటపెట్టిన టీఆర్ఎస్ చీఫ్ కవిత
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
  • హరీశ్ నీళ్లు, నిధుల దొంగే కాదు.. బొగ్గు దొంగ కూడా
  • భూకంప జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మల్లన్నసాగర్ కట్టి ఇప్పుడు బ్లాస్టింగ్ డ్రామా
  • హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లాలూచీ లేకుంటే విచారణ చేయించు: సీఎంకు కవిత సవాల్
  • సిద్దిపేటలో తెలంగాణ రక్షణ 
  • సేన పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ

మెదక్/సిద్దిపేట రూరల్, వెలుగు: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ చుట్టూ ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత నేతలకు భూములు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆ భూముల వివరాలను మీడియాకు చూపించారు. ఆ ప్రాంతంలో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఒక్క ఎకరా కూడా లేదని స్పష్టం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ బావిలోకి కెనాల్ ఉందో లేదో బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాల పెంపు నుంచి పాల దందా దాకా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆధారాలు ఇస్తున్నా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

‘గుంపు మేస్త్రీతో గుంటనక్క కుమ్మక్కైంది. హరీశ్‌‌‌‌తో లాలూచీ లేకపోతే ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి నా ఆరోపణలన్నింటికీ సమాధానం చెప్పాలె. దమ్ముంటే విచారణకు ఆదేశించాలె’ అని సవాల్ విసిరారు. శుక్రవారం సిద్దిపేట శివారులో భర్త అనిల్‌‌‌‌తో కలిసి పార్టీ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.

నా అఫిడవిట్ కంటే ఎక్కువుంటే రాసిస్త

బీఆర్ఎస్‌‌‌‌లో జరిగిన అవినీతిలో తనకు పైసా భాగస్వామ్యం లేదని అన్నారు. తనను బీఆర్ఎస్ నుంచి పంపించిన తర్వాత తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పానని, తన అఫిడవిట్‌‌‌‌లో చూపించిన దాని కన్నా గజం స్థలం గానీ, పైసా గానీ ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే రాసిస్తానని చెప్పారు. 

మల్లన్నసాగర్‌‌‌‌పై బ్లాస్టింగ్ డ్రామా

భూకంప జోన్‌‌‌‌లో మల్లన్నసాగర్ కట్టిన హరీశ్ రావు ఇప్పుడు బ్లాస్టింగ్ డ్రామా ఆడుతున్నారని కవిత ఆరోపించారు. ‘మల్లన్నసాగర్‌‌‌‌కు 20 కిలోమీటర్ల దూరంలో 1983లో భూకంపం వచ్చింది. బండ్‌‌‌‌కు ఇబ్బంది రాకుండా కెమికల్ ట్రీట్‌‌‌‌మెంట్ చేసిన తర్వాతే కట్టాలని 2018లో ఎన్జీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. కానీ కమీషన్ల కోసం అవేమీ పట్టించుకోకుండా రూ.6 వేల కోట్ల అంచనాను రూ.9,800 కోట్లకు పెంచి ఆగమాగం పనులు చేయించారు. ఇప్పుడు బండ్ దగ్గర లీకులు మొదలయ్యాయి. దాన్ని కవర్ చేసేందుకే బ్లాస్టింగ్ పేరుతో హరీశ్ హంగామా చేస్తున్నడు’ అని అన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్నసాగర్‌‌‌‌కు నీళ్ల తరలింపు పనుల డిజైన్ మార్చి రూ.1,700 కోట్లు అంచనా పెంచారని, కొండపోచమ్మ అవినీతిలో ముగ్గురు ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

బొగ్గునూ వదల్లే

హరీశ్ రావు నీళ్లు, భూముల్లోనే కాదు బొగ్గులోనూ అవినీతి చేశారని కవిత ఆరోపించారు. సిద్దిపేటలో బొగ్గు డంపింగ్ యార్డ్ పేరుతో పర్మిషన్లు తీసుకుని, మహారాష్ట్ర నుంచి బొగ్గు తెస్తున్నట్లు చెప్పి, సింగరేణి నుంచి తెప్పించుకున్నారన్నారు. హెల్త్ మినిస్టర్‌‌‌‌గా ఉన్నప్పుడు నిమ్స్‌‌‌‌ లో రూ.100 కోట్ల స్కామ్ జరిగిందని, గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లేకుండానే రూ.25 కోట్ల ఈపీఎఫ్ నిధులను వేరే ఖాతాలకు మళ్లించారని, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను బెదిరించి రూ.2 వేల కోట్ల పాల వ్యాపారం చేశారని ఆరోపించారు. సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన మూడెకరాలు దోచుకుని, మరో రెండెకరాలు సన్నిహితులకు ఇప్పించారని, ఒక వ్యాపారికి లాభం చేసేందుకు సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌‌‌‌ను ఊరి చివరికి తరలించారని అన్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఎకరా రూ.6 లక్షల చొప్పున 14 ఎకరాలు తీసుకుని హరీశ్ గెస్ట్‌‌‌‌ హౌస్ కట్టుకున్నారని  కవిత ఆరోపించారు.

సిద్దిపేటకు స్వాతంత్ర్యం తెస్తం

మూడు రిజర్వాయర్లతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉండగా, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకతో కలిపి లక్ష ఎకరాలకే నీళ్లు వస్తున్నాయని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ‘ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు’ అని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సిద్దిపేటకు రాలేదని, ఇక్కడ ప్రజలు భయంతో బతుకుతున్నారని, మున్సిపల్ ఎన్నికల నుంచే పోరాటంతో సిద్దిపేటలో తమ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు.