- లోలోపల అమ్మను ఇష్టపడ్తరు.. బయటకు చెప్పరు
- బీజేపీ నేతలంతా ఆ బుక్ చదువుతున్నరని వ్యాఖ్య
- సోనియా ఆత్మకథపై బీజేపీ విమర్శలకు రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ: తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘భక్తులు ఆ పుస్తకంపై ఎంత ఎక్కువగా కామెంట్ చేస్తే, అది అంత బాగా అమ్ముడవుతుంది’ అని ఎద్దేవా చేశారు. ఇన్స్టాగ్రామ్లో శుక్రవారం నిర్వహించిన ‘ఆస్క్ మీ’ సెషన్లో, సోనియా పుస్తకం గురించి బీజేపీ ఇంతగా ఎందుకు మాట్లాడుతోందని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిచ్చారు. ‘ఇది గొప్ప పుస్తకం. వాళ్లంతా దాన్ని చదువుతున్నారు, చదవకుండా ఉండలేకపోతున్నారు’ అని అన్నారు. చాలా మంది బీజేపీ నేతలు లోలోపల తన తల్లిని ఇష్టపడతారని, ఆమె అద్భుతమైన వ్యక్తి అని అనుకుంటారని, కానీ దురదృష్టవశాత్తు ఆ మాట బయటకు చెప్పలేరని వ్యాఖ్యానించారు.
ఎమర్జెన్సీని సమర్థించారు: బీజేపీ
మంగళవారం మార్కెట్లోకి వచ్చిన సోనియా ఆత్మకథపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. 1975 ఎమర్జెన్సీని సమర్థించేందుకు సోనియా ప్రయత్నించారని, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై భర్త రాజీవ్ గాంధీకి క్లీన్చిట్ ఇచ్చారని ఆరోపించింది. నెహ్రూ–గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలకు చక్కెర పూత పూయడమే ఈ పుస్తకం ఉద్దేశంలా ఉందని, దానికి ‘బిలాంగింగ్’ బదులు ‘వైట్వాషింగ్’ అని పేరు పెట్టాల్సిందని బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని సోనియా తన పుస్తకంలో తీవ్రంగా విమర్శించారు.
