- ధరలు తగ్గడంతో ఫుల్లు డిమాండ్
- 52 టన్నులు అమ్మిన వ్యాపారులు
న్యూఢిల్లీ: బంగారం ధరలు తగ్గడం పసిడి కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ఉన్న గరిష్ట ధరతో పోలిస్తే దాదాపు 21 శాతం తగ్గడంతో ధన్‌తేరాస్, దీపావళి సమయంలో పెద్ద ఎత్తున కొన్నారు. ఈసారి పండగలకు రూ.72 వేల కోట్ల విలువైన 52 టన్నుల బంగారం అమ్ముడైనట్లు ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించింది. జనవరిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.80 లక్షలకు చేరగా, ధరలు తగ్గి రూ.1.42 లక్షల స్థాయికి దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బంగారం ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. పండగల సంప్రదాయం, పెళ్లిళ్ల సీజన్ వల్ల కొనుగోళ్లకు మాత్రం మంచి ఊపు వచ్చింది. పెళ్లిళ్ల కోసం కొనుగోళ్లు పెరగడం కూడా అమ్మకాలకు తోడైంది. గతేడాది పండగల కాలంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు సగటున 25 శాతం పెరిగాయి.
జ్యూయలరీ కంపెనీలు ఖుషీ
జోయాలుక్కాస్ అమ్మకాలు 25 శాతం పెరిగాయి. తేలికపాటి ఆభరణాలు, బంగారు నాణేలకు మంచి గిరాకీ వచ్చిందని సంస్థ సీఎండీ జాన్ అలుక్కాస్ తెలిపారు. సెంకో గోల్డ్ కూడా ఈసారి 25 శాతానికి పైగా వృద్ధి సాధించింది. అధిక ధరల వల్ల కస్టమర్లు తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా నగలను ఎంచుకున్నారు. 30–40 గ్రాముల బరువుండే హారాల స్థానంలో 12–13 గ్రాముల తేలికపాటి నగలను కొన్నారు. 18 క్యారెట్ల బంగారంతో చేసిన 3–4 గ్రాముల బ్రాస్లెట్ల వంటి నగలకూ గిరాకీ పెరిగింది. చిన్న బంగారు నాణేలు, తక్కువ క్యారెట్ల నగలూ భారీగా అమ్ముడయ్యాయి. ఈసారి ధన్‌తేరాస్ నవంబర్ ఒకటో తేదీన రావడం, నవంబర్ 20 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుండటంతో పండగ కొనుగోళ్లతో పాటు పెళ్లి నగల అమ్మకాలూ పెరిగాయి.
రూ.2,500 తగ్గిన పుత్తడి, వెండి ధర రూ.3,500 డౌన్
బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2,500 పడిపోయి రూ.1,40,900కు చేరింది. గురువారం ఈ ధర రూ.1,43,400గా ఉంది. దీపావళి తర్వాత కొనుగోళ్లు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన పరిస్థితులు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3,500 తగ్గడంతో ధర రూ.1,84,000కు చేరింది. అమెరికా డాలర్ బలపడటం, అక్కడ ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీ పెరగడం పసిడి, వెండిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
