ఒకప్పుడు బాల్యమంటే వీధుల్లో ఆటలు, చెట్లెక్కే అల్లరి, అమ్మ ఒడిలో కథలు, స్నేహితులతో సరదాలు, రంగురంగుల కలలు! మరి ఇప్పుడు బాల్యమంటే పాఠశాల, ట్యూషన్, హోంవర్క్, పరీక్షలు, ర్యాంకులు, స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా! పిల్లల చేతుల్లో బొమ్మల స్థానంలో మొబైల్ ఫోన్లు. వారి కళ్లల్లో అమాయకత్వం స్థానంలో మార్కుల ఆందోళన, వారి మనసుల్లో ఆటపాటల స్థానంలో పోటీ ప్రపంచపు ఒత్తిళ్లు! నిజంగా మనం పిల్లల భవిష్యత్తును నిర్మిస్తున్నామా? లేక వారి బాల్యాన్ని పోటీపందెంలో పణంగా పెడుతున్నామా? ప్రతి సంవత్సరం నవంబర్ 14న భారతదేశ వ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటాం. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినమైన ఈ రోజున బాలల పట్ల ఆయనకున్న ప్రేమను స్మరించుకుంటాం. కానీ ఈ ఒక్కరోజు వేడుకలతోనే బాలల పట్ల మన బాధ్యత ముగిసిపోతుందా?
నేడు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. కృత్రిమ మేధస్సు ( ఏఐ), డిజిటల్ విద్య, అంతరిక్ష పరిశోధనలు, ఆధునిక వైద్య సాంకేతికతలు మానవ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నాయి. అయితే ఇదే ప్రపంచంలో యుద్ధాలు, పేదరికం, ఆకలి వలసలు, వాతావరణ విపత్తులు లక్షలాది బాలల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎక్కడో యుద్ధ ప్రాంతాల్లో పాఠశాలలు ధ్వంసం అవుతుంటే , మరెక్కడో పిల్లలు కుటుంబాలకు దూరమై శరణార్థి శిబిరాల్లో జీవిస్తున్నారు. ఒకవైపు కొందరు పిల్లలు అత్యాధునిక సాంకేతికతతో చదువుకుంటుంటే, మరోవైపు మరికొందరికి కనీస విద్య, తాగునీరు, పోషకాహారం కూడా అతని పరిస్థితి ఉంది. యూనిసెఫ్ నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలు మనల్ని ఆలోచింపచేస్తున్నాయి. బాల్యం అనేది కేవలం వయసుకు సంబంధించిన దశ కాదు. పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్య, పోషణ, ప్రేమ, స్వేచ్ఛతో కూడిన జీవన హక్కు.
డిజిటల్ ప్రపంచం జ్ఞానద్వారమా? ప్రమాదాల వలయమా?
సాంకేతికత పిల్లలకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. ఇంటర్‌నెట్ ద్వారా ప్రపంచ విజ్ఞానాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ తరగతులు, విద్యా యాప్‌లు, కృత్రిమ మేధస్సు వంటి సాధనాలు విద్యను నేర్చుకునే విధానాన్ని మార్చేస్తున్నాయి. అయితే అదే సమయంలో మొబైల్ ఫోన్లకు అతిగా అలవాటుపడటం, సోషల్ మీడియా ప్రభావం, సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ మోసాలు, అనుచిత కంటెంట్ వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికతకు పిల్లలు బానిసలు కాకూడదు. సాంకేతికతను తమ అభివృద్ధికి వినియోగించుకునే విజ్ఞానవంతులుగా పిల్లలుగా ఎదగాలి. బాలలకు కావాల్సింది కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా! పిల్లలకు పుస్తక జ్ఞానంతోపాటు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం నేర్పించాలి. ఓటమిని అంగీకరించే మనస్తత్వం విజయాన్ని వినయంతో స్వీకరించే లక్షణం, ఇతరులను గౌరవించే సంస్కారం, ప్రకృతిని ప్రేమించే గుణం, సమాజం పట్ల బాధ్యత, ప్రశ్నించే తత్వం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించాలి.
మార్పు ఎక్కడ మొదలవ్వాలి?
తల్లిదండ్రులు పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం కంటే వారితో గడిపే విలువైన సమయాన్ని ఇవ్వాలి. వారి మాటలు వినాలి. వారి అభిరుచులను అర్థం చేసుకోవాలి, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా ప్రతిభను ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, పరిశోధన దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించాలి. పాఠశాలలు భయాన్ని కలిగించే ప్రదేశాలుగా కాకుండా ఆనందంగా నేర్చుకునే కేంద్రాలుగా మారాలి.
ఒక దేశ అభివృద్ధిని కేవలం ఆకాశ హార్మ్యాలతోనో, సాంకేతిక పురోగతితోనో, ఆర్థికవృద్ధితోనో కొలవలేం. ఆ దేశంలోని చిన్నారులు ముఖాల్లో సంతోషం.. ఎంతటి చిరునవ్వు ఉందో, వారి కళ్లల్లో ఎన్ని ఉన్నత కలలు ఉన్నాయో, ఆ కలలను సాకారం చేసుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో దానితో కొలవాలి. పిల్లలు మన ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చడానికి పుట్టలేదు. తమ సొంత కలలను, కళలను సాకారం చేసుకోవడానికి పుట్టారు. వారి బాల్యాన్ని కాపాడుదాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇద్దాం. వారి ప్రతిభకు రెక్కలిద్దాం. వారి కలల సాకారానికి సహకరిద్దాం. బాలల హక్కులను కాపాడుదాం. ఎందుకంటే బాల్యం వికసిస్తేనే భారతదేశం వెలుగుతుంది.
- రోజా నాగపురి,సోషల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
