- శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు
- నేడు ఉదయం 9.30 గంటలకు గిగ్ వర్కర్ల తో కలిసి రాహుల్ర్యాలీ
- గిగ్ వర్కర్ల సోషల్ సెక్యూరిటీ పాలసీ ప్రకటన.. కార్మికులతో ముఖాముఖి
- భారత్ సమిట్ ముగింపు కార్యక్రమంలో కీలక ప్రసంగం
- సభాస్థలిని పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: భారత్ సమిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరిన ఆయన ఒంటి గంట సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. రాహుల్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్ కు చేరుకున్న రాహుల్ రాత్రి అక్కడే బస చేశారు.
శనివారం ఉదయం 9. 30 గంటలకు శిల్పారామం వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మీనాక్షి టవర్స్ గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి భారీ ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు. అనంతరం డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే గిగ్ వర్కర్స్పాలసీ అమలును ప్రకటిస్తారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ అమల్లోకి వస్తుంది. అనంతరం లంచ్ విరామం కోసం తిరిగి నోవాటెల్ హోటల్ కు వెళ్తారు. సాయంత్రం 4. 30 గంటలకు హెచ్ఐసీసీలోని భారత్ సమిట్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని తిరిగి ఢిల్లీకి వెళ్తారు. కాగా, గిగ్ వర్కర్లతో రాహుల్ సమావేశం కోసం ఏర్పాటు చేసిన సభాస్థలాన్ని శుక్రవారం రాత్రి గనులు, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీసిన ఆయన, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పలు సూచనలు చేశారు. మంత్రి వెంట పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషి తదితరులు ఉన్నారు.
