తెలంగాణపై విషం చిమ్మొద్దు..బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

తెలంగాణపై విషం చిమ్మొద్దు..బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్
  • మీరు వ్యతిరేకిస్తున్నది తెలంగాణ ప్రజలను.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను కాదు
  • సమిట్‌‌‌‌‌‌‌‌కు 115 మంది ప్రతినిధులకు వీసాలు నిరాకరించిన కేంద్రం
  • ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమిట్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడితే తప్పేంటి?
  • కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ లెక్కల్లో లేరన్న సీఎం
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు గడ్డం పెరుగుతున్నది.. తెలివి తగ్గుతున్నదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు:తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా బీజేపీ, బీఆర్ఎస్ కూడబలుక్కుని వ్యతిరేకిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, వర్ధమాన దేశాల హక్కుల కోసం నిర్వహిస్తున్న భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌కూ అడ్డుతగులుతున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తమ కడుపులో ఉన్న విషం, కండ్లలో ఉన్న కోపం తెలంగాణ ప్రజలపై చూపొద్దు. మీరు వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను కాదు, తెలంగాణ ప్రజలను అని మరిచిపోవద్దు’ అని హెచ్చరించారు. 

మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, తుమ్మిడిహెట్టికి అడ్డుతగులుతూ వచ్చిన కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్ ఇప్పుడు భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావుతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు.

115 మందికి వీసాలు ఇయ్యలే

శుక్ర, శనివారాల్లో జరుగుతున్న భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌కు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానిస్తే, వారిలో 115 మందికి కేంద్రం వీసాలు నిరాకరించిందని సీఎం చెప్పారు. ‘రాష్ట్రానికి పెట్టుబడుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రపంచ శాంతి కోసం ఇక్కడ చర్చలు జరపడం తప్పా?’ అని ప్రశ్నించారు. 

సమిట్ కు వచ్చిన విదేశీ ప్రతినిధులు తిరిగి వెళ్లాక మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని, అది పెట్టుబడులకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ లక్ష్యమన్నారు. విదేశీ శక్తులు పాల్గొంటున్నాయని బీజేపీ, డబ్బు వృథా చేస్తున్నారని బీఆర్ఎస్ అనవసర ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

ప్రతిపక్ష నేత మాట్లాడితే తప్పేంది?

గతంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ, ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని భారత ప్రతినిధిగా విదేశాలకు పంపి సంస్కారం చూపారని, ఆ ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని బీజేపీ ఎందుకు పాటించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రి హోదా ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్‌లో మాట్లాడితే తప్పేంటన్నారు. రాజకీయాల కోసం రాహుల్ పర్యటనను అడ్డుకోవద్దని సూచించారు. చైనా, పాకిస్తాన్ విషయాల్లో మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించే బీజేపీ నేతలు, రాహుల్ హైదరాబాద్ వస్తే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 

రాహుల్‌ను రీ–లాంచ్ చేసేందుకే ఈ సమిట్ అన్న బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ.. రాహుల్ కాబోయే ప్రధాని అని, ఆయనను ప్రమోట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాహుల్ ఎదుగుదల పట్ల బీజేపీకి భయం పట్టుకుందని, 140 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ముందు బీజేపీ మరో 20 ఏండ్లలో కనుమరుగవుతుందని అన్నారు.

వాళ్లు తెలంగాణ లెక్కల్లో లేరు

ఢిల్లీలో గ్లోబల్ సమిట్ కర్టెన్ రైజర్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చారని, అక్కడి బీజేపీ నేతలు కూడా స్వాగతించారని సీఎం గుర్తుచేశారు. కానీ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను ఆహ్వానించినా రాలేదని, ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశానికీ రాలేదని, అందుకే వాళ్లు తెలంగాణ లెక్కల్లో లేరని అన్నారు. కిషన్ రెడ్డి ఎంపీ కావడానికి, కేంద్ర మంత్రి కావడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయనకు గడ్డం పెరుగుతున్నా తెలివి తగ్గుతోందని ఎద్దేవా చేశారు. మోదీ సర్కార్ గుజరాత్ కోసమే పనిచేస్తోందని, తెలంగాణ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

నేటి నుంచి గిగ్ వర్కర్స్ పాలసీ

భారత్ సమిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన గిగ్ వర్కర్స్ పాలసీని శనివారం నుంచి అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీన్ని రాహుల్ గాంధీకి అంకితం చేస్తున్నామన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన మాట ప్రకారమే ఈ పాలసీ తెచ్చామని, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం అత్యుత్తమ విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రాహుల్‌ను ఆహ్వానించారని, సమిట్ ముగింపు సమావేశంలో కార్మికుల సంక్షేమంపై రాహుల్ తన అభిప్రాయాలు పంచుకుంటారని తెలిపారు.

కవిత ఇంటిపై తిరిగే డ్రోన్‌తో మాకు సంబంధం లేదు: సీఎం

కవిత ఇంటిపై డ్రోన్ తిరిగిన ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కవిత ఇంటిపై డ్రోన్లు ఎగరేసి నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. మీడియా సమావేశం తర్వాత విలేకరులతో ఆయన చిట్‌చాట్ చేశారు. ‘అది కవితకు, బీఆర్ఎస్‌కు మధ్య కుటుంబ పంచాయితీ వ్యవహారం అయి ఉండొచ్చు. ఆ వివాదాన్ని వాళ్లే తేల్చుకోవాలె. వాళ్ల పంచాయితీని మాకు ముడిపెట్టొద్దు’ అని అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటూ, ఇదంతా పైసల కోసమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, నిజానికి అలాంటి పనులు చేసేది వాళ్లేనని సీఎం ఎదురుదాడి చేశారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మాలయ స్టూడియో భూముల సంగతి చూస్తామని బీఆర్ఎస్ నేతలు బెదిరించారు. అధికారంలోకి వచ్చాక ఆ భూముల జోలికి రాకుండా ఉండేందుకు పైసలు వసూలు చేశారు’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసులో సంచలన విషయాలు: సీఎం

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ త్వరలోనే ముగుస్తుందని, ఈ కేసులో సంచలన విషయాలు బయటికొస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని, ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో.. మీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందా అని విలేకరులు ప్రశ్నించగా, తన ఫోన్ ట్యాప్ చేసినా తనకేం ఇబ్బంది లేదని, తన ఫోన్‌‌‌‌లో ఏదైనా వినొచ్చని సీఎం చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశం తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడారు.