తెలంగాణలోని పీజీ మెడికల్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ షురూ

తెలంగాణలోని పీజీ మెడికల్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ షురూ
  •     1,910 సీట్లతో మ్యాట్రిక్స్.. 3,613 మందితో ఫైనల్ మెరిట్ లిస్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నిమ్స్‌‌ లో 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్‌‌ను ప్రారంభించడంతో పాటు ఫైనల్ మెరిట్ లిస్టు, అడిషనల్ లిస్టు, పీడబ్ల్యూడీ అర్హత జాబితా, సీట్ మ్యాట్రిక్స్, 22 ప్రైవేట్ కాలేజీల ఫీజు వివరాలను వర్సిటీ వెబ్‌‌సైట్‌‌లో పెట్టింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన 3,611 మందితో ఫైనల్ మెరిట్ లిస్టును ప్రకటించిన వర్సిటీ, కోర్టు ఉత్తర్వులతో అడిషనల్ లిస్టులో మరో ఇద్దరిని చేర్చడంతో మొత్తం అర్హుల సంఖ్య 3,613కు చేరింది. మొత్తం 1,910 సీట్లలో నాన్-సర్వీస్ విభాగంలో 1,427 సీట్లు, సర్వీస్ కోటాలో 383 సీట్లు ఉన్నాయి. నాలుగు మైనారిటీ కాలేజీల్లోని 100 సీట్లను (నాన్-సర్వీస్ 76, సర్వీస్ 24) ముస్లిం మైనారిటీ అభ్యర్థులకే కేటాయిస్తారు. మెరిట్ లిస్టులో ఉన్నవారు ఎల్లుండి(నవంబర్ 15) మధ్యాహ్నం 2 గంటల వరకు tspgmed.tsche.in లో ఎన్ని వెబ్ ఆప్షన్లైనా ఇచ్చుకోవచ్చు, సీట్ మ్యాట్రిక్స్‌‌ను knruhs.telangana.gov.in లో చూడొచ్చు. 

ప్రైవేట్ కాలేజీల్లో 60 శాతం ఫీజే..

రాష్ట్రంలోని 22 ప్రైవేట్ అన్‌‌ ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో 2026–29 బ్లాక్ పీరియడ్‌‌ కు పాత ట్యూషన్ ఫీజులనే కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో 163 విడుదల చేసింది. వార్షిక ఫీజు క్లినికల్ కోర్సులకు కేటగిరీ–ఏలో రూ.7 లక్షలు–రూ.7.75 లక్షలు, కేటగిరీ–బీలో రూ.23 లక్షలు–రూ.24 లక్షలు, పారా-క్లినికల్ కోర్సులకు కేటగిరీ–ఏలో రూ.4.30 లక్షలు–రూ.4.62 లక్షలు, కేటగిరీ–బీలో రూ.5.30 లక్షలు–రూ.7.50 లక్షలు; నాన్-క్లినికల్ కోర్సులకు కేటగిరీ–ఏ, బీలో రూ.1.70 లక్షలు–రూ.2.16 లక్షలుగా నిర్ణయించారు. అన్నింటిలో కేటగిరీ–సీ ఫీజు బీ కంటే గరిష్టంగా మూడు రెట్లు ఉంటుంది.