శ్రీమతి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ కేవలం రాజకీయ జ్ఞాపకాల పుస్తకం మాత్రమే కాదు. ఇటలీ నుంచి భారతదేశం వరకు సాగిన ఒక ప్రయాణం ఇందులో ప్రతిబింబిస్తుంది. ప్రేమ, విషాదం, సేవ, మన దేశంతో ఏర్పడిన అనుబంధం, భారత ప్రజల పట్ల అంకితభావం ఆ ప్రయాణంలో అంతర్లీనంగా నిలిచాయి. మేడమ్ సోనియా గాంధీ పట్ల నాకు ఎప్పటినుంచో అపారమైన గౌరవం, అభిమానం ఉన్నాయి.
భారత వాయుసేనలో ఫైటర్ పైలట్‌గా పనిచేస్తూ, రాష్ట్రపతి కార్యాలయానికి డిప్యుటేషన్‌పై రాష్ట్రపతి భవన్‌లో ఉన్న సమయంలోనే నేను తొలిసారిగా రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలను కలిశాను.ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె నాపై అపారమైన విశ్వాసం ఉంచి మంత్రిగా, ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు లభించింది.
సోనియా గాంధీ పట్ల కృతజ్ఞత భావం
నా రాజకీయ ప్రస్థానంలోని మలుపులనూ, మైలురాళ్లనూ నెమరువేసుకున్నప్పుడల్లా శ్రీమతి సోనియా గాంధీ పట్ల కృతజ్ఞత భావం ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రజాజీవితంలో నేను సాధించిన ప్రతిదానికీ ఆమె నాపై ఉంచిన విశ్వాసమే మూలం. ఆ అనుబంధం వల్ల ఆమె ఆత్మకథ చదవడం నాకు మరింత ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఇటలీలోని బాల్యం నుంచి కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో పరిచయం, ఆ తరువాత భారతదేశానికి రావడం, ఈ దేశాన్ని తన ఇంటిగా చేసుకోవడం వరకు సోనియా గాంధీ జీవన ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తోంది.
ఒక భార్యగా, తల్లిగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని దేశ చరిత్రతో ముడిపెట్టి చూపిస్తుంది. సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలు దేశ చరిత్రలో కీలక ఘట్టాలే కాకుండా, ఒక కుటుంబాన్ని కుదిపేసిన తీవ్ర విషాదాలు కూడా. ఆ సంఘటనల వెనుకనున్న మానవీయ కోణాన్ని ఈ జ్ఞాపకాలు మన ముందుకు తెస్తాయి. గౌరవ మర్యాదల హద్దులు దాటిన వ్యక్తిగత దాడులను మేడమ్ సోనియా గాంధీ ఎదుర్కొన్న తీరును భారతదేశం మొత్తం గమనించాలి. అయినప్పటికీ ఆమె వాటికి గౌరవం, సంయమనం, హుందాతనంతోనే సమాధానమిచ్చారు. సిద్ధాంతాలపై నిలబడుతూనే మర్యాదను, మానవత్వాన్ని కాపాడుకోవచ్చని ఆమె జీవితం నాకు చూపించింది. అవమానానికి ఆగ్రహంతో బదులివ్వడం సులభమైనా, ప్రజాజీవితంలో ఆమె ఆత్మనిగ్రహాన్ని, బాధ్యతాభావాన్ని నిలబెట్టుకున్నారు.
భారతదేశ ప్రజలకు సోనియా జీవితం అంకితం
ఏళ్ల తరబడి రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకున్న ఆమె చివరకు రాజకీయాల్లోకి రావడం విధి నిర్వహణలో భాగం. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా క్లిష్టకాలంలో పార్టీకి దిశానిర్దేశం చేసి, కొత్త ఉత్సాహాన్ని అందించారు. విస్తృత కూటమిని నిర్మించడంలో ఆమె నాయకత్వం కీలక పాత్ర పోషించింది. 2004లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి ఆమె మద్దతు ఇవ్వడం రాజకీయ వివేకానికి, వ్యక్తిగత నిబద్ధతకు అరుదైన ఉదాహరణగా నిలిచింది.
ఈ పుస్తకంలోని అంతర్లీన భావాన్ని దాని శీర్షిక చక్కగా తెలియజేస్తుంది. పుట్టిన నేలతో మాత్రమే అనుబంధం ఏర్పడదు. ప్రేమ, కలసి ఎదుర్కొన్న కష్టాలు, సేవ ద్వారా అది పెరుగుతుంది. సోనియా గాంధీ భారతదేశాన్ని తన ఇల్లుగా స్వీకరించి, ఈ దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి అంకితమయ్యారు. ప్రజా బాధ్యతల వెనుక ఆప్యాయత, విషాదం, ధైర్యం, నిబద్ధతలతో రూపుదిద్దుకున్న ఒక మహిళను అర్థం చేసుకునే అరుదైన అవకాశాన్ని ఈ పుస్తకం పాఠకులకు అందిస్తుంది. నాకు ఈ పుస్తకం కృతజ్ఞతను గుర్తుచేసే రచన కూడా.
మేడమ్ సోనియా గాంధీ నాపై ఉంచిన విశ్వాసం కాంగ్రెస్‌లోనూ, ప్రజాసేవలోనూ నా జీవితాన్ని మలిచిన ఎన్నో అవకాశాలను అందించింది. అందుకు నేను ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. భారతదేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ గొప్ప మహిళకు నా వందనం. మన దేశ సేవలో ప్రేమ, గౌరవం, ధైర్యం, త్యాగం ఎలా ఉండాలో ఆమె తన జీవితంతో చూపించారు.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి,
నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి,
తెలంగాణ
