రేటింగ్ కాదు.. హక్కులు కావాలె..పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్లు అంటూ కంపెనీల వెట్టిచాకిరి

రేటింగ్ కాదు..  హక్కులు కావాలె..పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్లు  అంటూ కంపెనీల వెట్టిచాకిరి
  • గిగ్ వర్కర్లకు జరిగే దోపిడీపై భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శనలు
  • రూ.100 సంపాదనలో రూ.32 పెట్రోల్, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే
  • ఎండలోనే డెలివరీలు.. టాయిలెట్, తిండికి చోటు లేదు
  • కనీస వేతనం, అల్గారిథమ్ పారదర్శకత సహా 8 డిమాండ్లు
  • నేడు రాహుల్ చేతుల మీదుగా రూల్స్, వెల్ఫేర్ బోర్డు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ‘ఓనర్ మీరే.. బాస్ మీరే.. మీరు వర్కర్లు కాదు పార్ట్ నర్లు’ అంటూ యాప్ కంపెనీలు గిగ్ వర్కర్లను దోచుకుంటున్న తీరును హైదరాబాద్‌‌‌‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్’ రెండో ఎడిషన్ కండ్లకు కట్టింది. కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా కోట్లాది మంది యువతతో గంటల తరబడి పనిచేయించుకుంటూ పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి కనీస భద్రత కల్పించడం లేదని ప్రదర్శనలు వెల్లడించాయి. డెలివరీ వర్కర్లు సంపాదించే ప్రతి రూ.100లో రూ.32 పెట్రోల్, బైక్ మెయింటెనెన్స్‌‌‌‌కే ఖర్చవుతున్నట్లు నివేదికలు తెలిపాయి. 

స్టార్ రేటింగ్ తగ్గితే విచారణ లేకుండానే ఐడీ డీయాక్టివేట్ చేసి రోడ్డున పడేస్తున్నారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 2026 మార్చిలో చట్టం చేసినా రూల్స్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో మార్పు లేదని సంఘాలు పేర్కొన్నాయి. ‘రేటింగ్ నహీ.. హక్ చాహియే’ అంటూ 8 డిమాండ్లు ముందుంచాయి. ఆర్డర్‌‌‌‌కు మాత్రమే డబ్బులు చెల్లిస్తుండటంతో కనీస ఆదాయం కోసం ప్రతి నలుగురిలో ఒకరు వారానికి 70 గంటలకు పైగా పనిచేస్తున్నారని వెల్లడించాయి.

కూర్చొని తినేందుకు చోటేదీ?

‘జన్‌‌‌‌పహల్’, ‘గిగ్ వర్కర్స్ అసోసియేషన్’, ‘యుపీజడ్ వై’ సంస్థలు 10 నగరాల్లో 4,163 మంది రైడర్లతో నిర్వహించిన సర్వేలో దయనీయ పరిస్థితులు వెలుగుచూశాయి. 84 శాతం మంది తీవ్రమైన ఎండ, వడగాడ్పుల్లో పనిచేస్తుండగా.. 91 శాతం మందికి శుభ్రమైన టాయిలెట్లు లేవు. 88 శాతం మంది కూర్చుని భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు స్థలం కావాలని కోరుతున్నారు. రోడ్ల పక్కన దుమ్ములో కూర్చుని తింటున్న దృశ్యాలను ఎగ్జిబిషన్‌‌‌‌లో ప్రదర్శించారు. న్యూయార్క్ తరహాలో హోటళ్లు, మాల్స్‌‌‌‌లో టాయిలెట్లు, రెస్ట్ రూమ్‌‌‌‌లు కల్పించేలా నిబంధనలు తేవాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనం ఖరారు చేయాలి

గిగ్ వర్కర్ల కోసం రాజస్థాన్ (2023 జూలై), బిహార్ (2025 జూలై), జార్ఖండ్ (2025 ఆగస్టు), కర్నాటక (2025 సెప్టెంబర్), తెలంగాణ (2026 మార్చి) చట్టాలు చేసినా.. కర్నాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పూర్తిస్థాయి అమలు కావడం లేదు. తెలంగాణలో శనివారం రాహుల్ గాంధీ చేతుల మీదుగా రూల్స్ విడుదల చేయనున్నట్లు వర్కర్లు తెలిపారు. అన్ని ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు ఒకే యూనిక్ ఐడీతో ఆటో రిజిస్ట్రేషన్, ఐడీ బ్లాక్ చేసే ముందు 7 రోజుల నోటీసు, విచారణ, టాస్క్ తిరస్కరణ హక్కు, సంక్షేమ బోర్డులో మహిళలతో సహా నలుగురు వర్కర్లకు ప్రాతినిధ్యం వంటి అంశాలు చట్టంలో ఉన్నాయని వివరించారు. అయితే కనీస వేతనం (పే ఫ్లోర్) ఖరారు చేయకపోవడం లోపమని పేర్కొన్నారు.

సంక్షేమ నిధిని బలోపేతం చేయాలి

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గంటకు రూ.1,300 కనీస వేతనం, కిలోమీటర్ అలవెన్స్, సియాటిల్‌‌‌‌లో పెయిడ్ సిక్ లీవ్స్, యూరోపియన్ యూనియన్‌‌‌‌లో అల్గారిథమ్‌‌‌‌లపై మానవ పర్యవేక్షణ, సింగపూర్‌‌‌‌లో సమ్మె హక్కు వంటి విధానాలను ప్రదర్శించారు. భారత్‌‌‌‌లో గిగ్ వర్కర్ల కోసం 8 అంశాలతో పీపుల్స్ చార్టర్ విడుదల చేశారు. కనీస వేతన హామీ, యూనియన్ల ఏర్పాటు హక్కు, సమస్యల పరిష్కారానికి పటిష్ట ట్రిబ్యునల్, కంపెనీల అల్గారిథమ్ పారదర్శకత, పీఎఫ్-ఈఎస్ఐతో సామాజిక భద్రత, ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్, న్యాయమైన ఒప్పందాలు, ప్రతి ఆర్డర్ లావాదేవీపై సెస్, ట్యాక్స్ విధించి సంక్షేమ నిధిని బలోపేతం చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.