- స్వయం సమృద్ధి దిశగా ఎదుగుతున్నం: ప్రధాని మోదీ
- కర్నాటక సీఎంతో కలిసి బెంగళూరు పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన మోదీ
బెంగళూరు: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న టైంలోనూ భారత్ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గడిచిన పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఇంధన భద్రత కోసం తీసుకున్న దూరదృష్టి చర్యలే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని.. ముడిచమురు నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేస్తూ ఇంధన స్వయం సమృద్ధి దిశగా ఎదుగుతున్నామని వివరించారు. సోలార్, హైడ్రో, విండ్ ఎనర్జీని కూడా విస్తరించామన్నారు.
బెంగళూరులోని డెయిరీ సర్కిల్ ఏరియాలో ఉన్న తవరెకెరె స్టేషన్ వద్ద ప్రధాని మోదీ శుక్రవారం ‘నమ్మ మెట్రో’ పింక్ లైన్ ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రారంభించారు. కర్నాటక సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర గవర్నర్ సుధా యాదవ్‌తో కలిసి ప్రధాని కొత్త మెట్రో సేవలకు పచ్చజెండా ఊపారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ తవరెకెరె స్టేషన్ కౌంటర్ వద్ద స్వయంగా యూపీఐ పేమెంట్ తో టికెట్ కొని, ఐఐఎం బెంగళూరు స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి బెంగళూరులో పునరుత్పాదక శక్తి, పెట్రోలియం మౌలిక వసతులతో సహా మొత్తం రూ.15,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు.
ఎల్పీజీ నిల్వ సామర్థ్యం 80 వేల మెట్రిక్ టన్నులు!
అనంతరం మోదీ మాట్లాడుతూ.. మంగళూరులో రూ.850 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా నిర్మించిన ఎల్పీజీ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వ సామర్థ్యం 80 వేల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని తెలిపారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో వంటగ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయడానికి వీలవుతుందని వివరించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తిని పెంచామని.. ముడిచమురు నిల్వ చేసుకునే ట్యాంకులను కట్టించామని వివరించారు. సోలార్, హైడ్రో, విండ్ ఎనర్జీని విస్తరించామని.. రైల్వేలను దాదాపు 100 శాతం విద్యుదీకరించామని తెలిపారు. మంగళూరులో గ్యాస్ నిల్వ ప్రాజెక్టు, బెంగళూరులో ఇంధన టెర్మినల్, బయోగ్యాస్ ప్లాంట్ వల్ల మనకు విదేశీ గ్యాస్ కొనే అవసరం ఉండదని, దీంతో డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద దేశవ్యాప్తంగా 60 లక్షల కుటుంబాలు రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని.. వీరిలో 40వేలకు పైగా కుటుంబాలు కర్నాటకలోనే ఉన్నాయని తెలిపారు. అలాగే, పీఎం-కుసుమ్ పథకం కింద 8 లక్షలకు పైగా సోలార్ పంపులు అందించి.. కర్నాటక రైతులకు సాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
సాంకేతికతలో అగ్రగామిగా భారత్
భారత్ ఇప్పుడు భవిష్యత్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ స్పష్టం చేశారు. సెమీకండక్టర్స్ తయారీ నుంచి షిప్‌ల నిర్మాణం వరకు, అలాగే ఏఐ డేటా సెంటర్స్ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు ప్రతి రంగంలోనూ దేశం దూసుకుపోతోందని చెప్పారు. 2014లో ప్రారంభించిన ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ స్ఫూర్తే దేశంలో మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ప్రధాన కారణమన్నారు. వారి పొదుపును పెంచేందుకు, కొనుగోలు శక్తిని బలోపేతం చేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుందన్నారు. టీడీఎస్ రూల్స్‌లో మార్పుల ద్వారా సీనియర్ సిటిజన్లకు, అద్దె ఆదాయం పొందుతున్న వారికి ఉపశమనం లభించిందన్నారు. అంతేకాకుండా, నెక్స్ట్-జెన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా రోజువారీ వస్తువులను చౌకగా మార్చామని గుర్తుచేశారు.
