- బీసీలు ఓటు బ్యాంకు కాదు.. పాలనలో భాగస్వాములు కావాలి
- ‘భారత్ సమ్మిట్–2026’లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, ఆత్మగౌరవం, పాలనలో భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక న్యాయం, సంపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమవుతాయని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్–2026’లో సామాజిక న్యాయంపై నిర్వహించిన చర్చల్లో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి చాంపియన్‌గా నిలుస్తున్నదని సీతక్క అన్నారు.
ప్రతిభ లేక కాదని, అవకాశాలు అందకే చాలామంది వెనుకబడుతున్నారని, కులం ఆధారంగా వ్యక్తుల విలువను నిర్ణయించకూడదని చెప్పారు. కులగణన సమాజంలో విభజన తెచ్చేది కాదని, అసమానతలను చూపించే ఎక్స్‌రే లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ సమస్యనూ పరిష్కరించామన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న ‘జిత్నీ ఆబాదీ ఉత్నా హక్’ స్ఫూర్తితో జనాభా ప్రకారం హక్కులు దక్కాలన్నారు.
‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని తెలిపారు. ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి, పదేళ్ల ఉద్యమ జీవితం తర్వాత తిరిగి చదువుకుని లాయర్‌గా, ఇప్పుడు మంత్రిగా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తనలాంటి లక్షలాది ఆడపిల్లలకు అవకాశాలు కల్పించడమే ఆకాంక్ష అన్నారు. తెలంగాణ రైజింగ్ విజయాన్ని ఎత్తైన భవనాలతో కాకుండా వెనుకబడిన ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులతో కొలవాలని చెప్పారు.
బీసీలు ఓటు బ్యాంకు కాదు..
రాష్ట్ర కులగణనలో బీసీ జనాభా 56.36 శాతంగా తేలిందని మంత్రి పొన్నం తెలిపారు. ఈ సంఖ్య విధాన నిర్ణయాల్లో ప్రతిబింబించాలని, బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేశామని, ఎంపిరికల్ డేటా ఆధారంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. ఈడబ్ల్యూఎస్‌కు 10% రిజర్వేషన్లు ఇచ్చినట్టే బీసీలకూ న్యాయం చేయాలన్నారు. కులగణనపై అధ్యయనానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో, ప్రొఫెసర్ కంచ ఐలయ్య వైస్ చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి, కులవృత్తులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
