అస్సాంలో ఘోరం..ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు.. 24 మంది మృతి

అస్సాంలో ఘోరం..ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు.. 24 మంది మృతి

గువాహటి: అస్సాంలోని కజిరంగా సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు 24 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మినీ బస్సు జోహాట్ నుంచి నాగావ్ వైపు వెళ్తుండగా కజిరంగా సమీపంలోని రంగాజన్ (హథీకులి టీ ఎస్టేట్ ప్రాంతం) వద్ద ఎదురుగా ఓ ట్రక్కు దూసుకొచ్చింది. అతివేగం కారణంగా బస్సు అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా పలువురు ప్రయాణికులు లోపల ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం జోహాట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి, ఇతర పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జాతీయ ఉద్యానవన ప్రాంతం సమీపంలో విధించిన నిబంధనలను ఉల్లఘించి బస్సు అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మినీ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే అది కంటైనర్ ట్రక్కును ఢీకొట్టి ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అస్సాం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అతుల్ బోరా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.