న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన ప్రధాన నగరంగా నిలిచింది. గాలిలో పీఎం 2.5 కాలుష్య కణాల సాంద్రత 24 గంటల్లోనే రెండింతలకు పైగా పెరిగి జాతీయ సురక్షిత ప్రమాణం కంటే నాలుగు రెట్లు అధికంగా నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా సుమారు 2 కోట్ల జనాభా కలిగిన ఈ నగరంలో దృశ్యమానత పూర్తిగా పడిపోయింది. గాలిలోని విషపూరిత పదార్థాల సాంద్రత ఆధారంగా వాయు నాణ్యతను కొలిచే స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ నివేదిక ప్రకారం.. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 334 వద్ద నమోదై ప్రమాదకర స్థాయికి చేరింది.
సాధారణంగా ఏక్యూఐ 50 లోపు ఉంటేనే అది ఆరోగ్యానికి సురక్షితమైన స్వచ్ఛమైన గాలిగా పరిగణిస్తారు. మరోవైపు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం ఢిల్లీ ఏక్యూఐ ఏకంగా 403 వద్ద నమోదై తీవ్రమైన కేటగిరీలో నిలిచింది. ఇక ఢిల్లీలోని ప్రధాన రహదారులపై వీధి దీపాలు సైతం కనిపించనంతగా దట్టమైన పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లోనూ గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. రాబోయే కొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
