పరిహారం చెల్లింపులో వివక్ష వద్దు..సిద్దిపేట జిల్లా భూ సేకరణ అధికారికి రైతుల వినతి

పరిహారం చెల్లింపులో వివక్ష వద్దు..సిద్దిపేట జిల్లా భూ సేకరణ అధికారికి రైతుల వినతి

సిద్దిపేట రూరల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాల్లోని వెంకటాపూర్, తడ్కపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న అదనపు టీఎంసీ ప్యారలల్ కాలువలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం పెంచి ఇవ్వాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ విషయమై శుక్రవారం మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డితో కలిసి జిల్లా భూ సేకరణ అధికారి ఆఫీస్ లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాంతాలవారీగా వివక్షత చూపుతోందని, సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాలలో వెంకటాపూర్ తడకపల్లి గ్రామాల్లో సుమారు 140 ఎకరాల వ్యవసాయ భూమి అదనపు టీఎంసీ ప్యారలల్ కెనాల్ లో ప్రభుత్వం భూ సేకరణ చేసిందని,2019లో వేసిన పీఎన్ ప్రకారం మాత్రమే రైతులకు పరిహారం చెల్లిస్తామని, 2019 నుంచి 2026 వరకు ఎక్స్​టెన్షన్​ చేసి ఈ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయాన్ని చేస్తుందని తెలిపారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఎకరాకు రూ.18 లక్షల పరిహారం చెల్లిస్తే, కొడంగల్​లో ఎకరాకు రూ.21 లక్షలు చెల్లిస్తున్నారని, అలాంటిది సిద్దిపేట నియోజక వర్గం రైతులకు మాత్రం  రూ.14.50లక్షలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ.23 లక్షలు చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్​ల ఫోరం ఉపాధ్యక్షులు చింతల రత్నాకర్ గౌడ్, రూరల్ సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి, అర్బన్ మండల అధ్యక్షుడు పూల బాలకృష్ణారెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, రూరల్ అర్బన్ మండల గ్రామాల సర్పంచ్​లు నరేందర్ రెడ్డి, అంబటి దేవదాస్ గౌడ్, గణపురం కృష్ణ, కోడూరి రాజు, మండల నాయకులు బత్తుల కిష్టారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కోటగిరి ప్రభాకర్, బండి శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.