కోయంబత్తూర్: తమిళనాడులోని టీవీకే ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని వి ది లీడర్స్ వ్యవస్థాపకుడు కె. అన్నామలై విమర్శించారు. అదే సమయంలో భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ చదవాల్సిన పుస్తకమని పేర్కొన్నారు. సోనియా ఆత్మకథను తాను చదవడం ప్రారంభించానని, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి రాజీవ్ గాంధీతో ఆమె ప్రయాణం, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఎమర్జెన్సీపై ఆమె అభిప్రాయాలు, 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం, క్యాన్సర్తో ఆమె చేసిన పోరాటం వంటి అంశాలపై ఆ పుస్తకం ఆసక్తికరమైన వివరాలను అందిస్తోందని అన్నామలై పేర్కొన్నారు.
కోయంబత్తూర్లో మీడియాతో మాట్లాడుతూ..
అధికార టీవీకే పార్టీకి చెందిన కళ్లకురిచ్చి ఎమ్మెల్యే, ఒక మహిళా కలెక్టర్ మధ్య తలెత్తిన వివాదంపై సీఎంవో, టీవీకే పార్టీ మౌనం వహించడాన్ని అన్నామలై ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారుల సంఘం కూడా మౌనం వీడి స్పందించాలని కోరారు. ఒక్క దీపావళి రోజే రాష్ట్రంలో గ్యాంగ్ వార్లు, 15 నుంచి 17 హత్యలు జరిగాయని ఆరోపించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత 300 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని పరేడ్ నిర్వహించడాన్ని తప్పుబట్టారు.
