రియల్ ఎస్టేట్ బిల్డర్లకు రెరా షాక్... 10.85 శాతం వడ్డీతో రిఫండ్లకు ఆదేశం..

రియల్ ఎస్టేట్ బిల్డర్లకు రెరా షాక్... 10.85 శాతం వడ్డీతో రిఫండ్లకు ఆదేశం..
  • నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానా

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు నిర్మాణ సంస్థలపై రెరా  కొరడా ఝుళిపించింది. తప్పుదోవ పట్టించే ప్రచారం, రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో భారీ జరిమానా విధించింది. కొనుగోలుదారులకు వడ్డీతో సహా రిఫండ్ చేయాలని రేరా అథారిటీ సభ్యులు లక్ష్మీ నారాయణ జన్ను, కె. శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా రాంపల్లి దాయరలోని ‘గోల్డెన్ కౌంటీ’ విల్లా ప్రాజెక్టుపై 27 మంది యజమానులు, సొసైటీ సభ్యులు రెరాకు ఫిర్యాదు చేశారు. ‘ప్లాటెడ్ లేఅవుట్‌‌’కు మాత్రమే అనుమతులు తీసుకుని, లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీగా తప్పుదోవ పట్టించే ప్రచారం చేసినట్లు రెరా నిర్ధారించింది. 

క్లబ్‌‌హౌస్, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేయకపోవడంతో సంస్థలకు రూ.20.05 లక్షల జరిమానా విధించింది. 90 రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని, 30 రోజుల్లో క్లబ్‌‌హౌస్, కామన్ ఏరియాలను అసోసియేషన్‌‌కు అప్పగించాలని ఆదేశించింది. ఫేజ్‌‌-1 విల్లాలకు ఓసీలు ఇప్పించాలని, కొనుగోలుదారులు మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.

10.85 శాతం వడ్డీతో రిఫండ్లకు  ఆదేశం

శామీర్‌‌పేటలోని ‘హ్యాపీ హోమ్స్ ఫేజ్‌‌-2’లో ఫ్లాట్ కోసం వినుకొండ రవి చెల్లించిన రూ.22.22 లక్షలను 10.85 % వార్షిక వడ్డీతో 60 రోజుల్లో తిరిగి ఇవ్వాలని  భువంతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ చెక్కా వెంకట సుబ్రహ్మణ్యంను రెరా ఆదేశించింది.   నానక్‌‌రామ్‌‌గూడలోని ‘వెస్టర్న్ వేవ్స్’ కమర్షియల్ ప్రాజెక్టులో స్పేస్ కోసం ముగ్గురు కొనుగోలుదారులు చెల్లించిన రూ.38 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో కలిపి 90 రోజుల్లో తిరిగి ఇవ్వాలని జయత్రి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ కాకర్ల శ్రీనివాస్‌‌ను ఆదేశించింది. 

అలాగే కొండాపూర్‌‌లోని ‘స్టార్‌‌లైట్ సెరెనా’ కమర్షియల్ ప్రాజెక్టును రిజిస్ట్రేషన్ లేకుండానే 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌‌గా ప్రచారం చేయడంపై రెరా అభ్యంతరం వ్యక్తం చేసింది. భూ వివాదాలు పెండింగ్‌‌లో ఉండగా ప్రచారం చేసినందుకు సెక్షన్ 59 కింద స్టార్‌‌లైట్ గ్లోబల్ ఎంటర్‌‌ప్రైజెస్‌‌పై జరిమానా విధించే చర్యలు చేపట్టాలని రెరా కార్యదర్శిని ఆదేశించింది.