‘భారత్ సమిట్’లో ‘తెలంగాణ రైజింగ్ - ఆర్థిక న్యాయం’పై నిపుణుల చర్చ

‘భారత్ సమిట్’లో ‘తెలంగాణ రైజింగ్ - ఆర్థిక న్యాయం’పై నిపుణుల చర్చ

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. ‘భారత్ సమిట్’లో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ - ఆర్థిక న్యాయం’ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌తో కలిసి జేఎన్‌‌‌‌యూ ఆర్థికవేత్తలు ప్రొఫెసర్లు హిమాన్షు, సంతోష్ మెహ్రోత్రా, అమీర్ ఉల్లా ఖాన్, ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు రతిన్ రాయ్ చర్చించారు.

రాష్ట్ర ఆదాయంలో 40 శాతానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తుండటం అభివృద్ధి అసమతుల్యతకు నిదర్శనమని మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌గౌడ్, బల్మూరి వెంకట్ అన్నారు. ఈ తారతమ్యాలను తొలగించి ఆదిలాబాద్, ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాలకూ పరిశ్రమలను విస్తరించాలన్నారు.

వ్యవసాయానికి  అనుసంధానించాలి
ప్రొఫెసర్ హిమాన్షు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో ఎల్లకాలం నిధులు పంచడం సాధ్యం కాదని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే పరిష్కారమన్నారు. వ్యవసాయేతర సీజన్లలో కూలీలకు అండగా ఉండే ఉపాధి హామీని వ్యవసాయ రంగంతో అనుసంధానించడంతో పాటు ఆహార శుద్ధి, లాజిస్టిక్స్ వ్యవస్థలను విస్తరించాలన్నారు. కేరళ, తమిళనాడు తరహాలో విద్య, వైద్యం, పోషకాహారంపై భారీగా ఖర్చు చేయాలని సూచించారు.

ప్రొఫెసర్ అమీర్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ.. యూపీ, బీహార్‌‌‌‌లతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం మెరుగ్గా ఉన్నా, హైదరాబాద్‌‌‌‌కు గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి అంతరం ఎక్కువగా ఉందన్నారు. 

ఎంఎస్​ఎంఈ లకు స్పెషల్​ ప్యాకేజీ ఇవ్వాలి
ఉన్నత విద్యావంతులైన యువత ఏటా పెరుగుతుండటంతో ఉద్యోగాల కల్పన సవాలుగా మారిందని ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా అన్నారు. కేంద్ర విధానాలతో దెబ్బతిన్న ఎంఎస్‌‌‌‌ఎంఈలను రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీలతో ఆదుకోవాలన్నారు.చైనా తరహాలో కనీసం 15 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలన్నారు. ఆధునిక రంగాల ఆదాయాలు స్థానికులకూ అందేలా విధానాలు మార్చాలని సూచించారు.