దావోస్‌‌‌‌కు దీటుగా గ్లోబల్ పాలసీ హబ్‌‌‌‌గా హైదరాబాద్

దావోస్‌‌‌‌కు దీటుగా గ్లోబల్ పాలసీ హబ్‌‌‌‌గా హైదరాబాద్
  • ప్రతినిధుల వీసాల రద్దు, కేంద్రం జాప్యం సరికాదు: సల్మాన్ ఖుర్షీద్
  • భారత్ సమిట్‌‌‌‌కు రాహుల్ గాంధీ స్ఫూర్తి.. సీఎం రేవంత్, మంత్రుల కృషి అభినందనీయం

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఆర్థిక, విధానపరమైన చర్చలకు దావోస్ ఎలాగైతే కేంద్రంగా ఉందో.. అదే తరహాలో హైదరాబాద్‌‌‌‌ను గ్లోబల్ పాలసీ హబ్‌‌‌‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.

భారత్ సమిట్ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతేడాది, ఈ ఏడాది నిర్వహిస్తున్న సమిట్‌‌‌‌కు రాహుల్ గాంధీ స్ఫూర్తి అని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల కృషి అభినందనీయమని కొనియాడారు.

తెలంగాణ అభివృద్ధిపై 8 సెషన్లు
రెండు రోజుల సదస్సులో విదేశాంగ విధానం, వాతావరణ మార్పులు వంటి అంతర్జాతీయ అంశాలపై 12 కీలక సెషన్లు నిర్వహిస్తున్నట్లు ఖుర్షీద్ తెలిపారు. వీటిలో 8 సెషన్లను తెలంగాణ వృద్ధి, అభివృద్ధిపై ప్రత్యేకంగా రూపొందించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలతోపాటు అంతర్జాతీయ విధాన చర్చలకూ ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

సదస్సుకు రావాల్సిన కొందరు ప్రతినిధుల వీసాలను చివరి నిమిషంలో రద్దు చేయడం, కేంద్రం జాప్యం చేయడం విచారకరమన్నారు. భారత్ సమిట్‌‌‌‌ను యాంటీ నేషనల్ సమావేశంగా అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. యూకే లేబర్ పార్టీ, బ్రెజిల్‌‌‌‌లో ఇటీవల తిరిగి ఎన్నికైన పార్టీతోపాటు ప్రపంచంలోని పలు అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు.