రైతుకు వచ్చే ఆర్థిక రాబడిని వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాకుండా పండించిన పంటకు లభించే ధర కూడా నిర్ణయిస్తుంది. ముందుగా నిర్ణయించిన ధరలకు అర్హత కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసే ధర భరోసా వ్యవస్థను ఇది అందిస్తుంది. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ రైతులకు గిట్టుబాటు రాబడిని కల్పిస్తుంది. ధర విషయంలో కొంత భరోసా అందించడం ద్వారా ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కనీస మద్దతు ధర రైతులకు సహాయపడుతుంది.
మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు అర్హత కలిగిన పంట ఉత్పత్తులను ప్రకటించిన ధరకు విక్రయించేందుకు ఎంఎస్పీ కొనుగోళ్లు అవకాశం కల్పిస్తాయి. ధరల అనిశ్చితిని తగ్గించడం, వ్యవసాయ ఆదాయ స్థిరత్వానికి తోడ్పడటం, తదుపరి వ్యవసాయ సీజన్లకు ప్రణాళికలు రూపొందించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ వ్యవస్థ ప్రయోజనాలు. ఆశించే రాబడిపై విశ్వాసాన్ని పెంచడం ద్వారా మెరుగైన విత్తనాలు, ఉత్పాదకతను పెంచే ఇతర ఉత్పాదకాలపై పెట్టుబడులకు సంబంధించిన రైతుల నిర్ణయాలకు కూడా ఎంఎస్పీ తోడ్పడుతుంది.
పారదర్శకంగా ఎంఎస్పీ ప్రయోజనాలు
కనీస మద్దతు ధర ప్రయోజనాలు రైతులకు మరింత నేరుగా, పారదర్శకంగా, సులభంగా అందేలా కొనుగోలు ప్రక్రియ అభివృద్ధి చెందింది. ధాన్యాలు, ముతక ధాన్యాలను ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), నియమిత రాష్ట్ర సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఎండు కొబ్బరిని ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆశా)లోని ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్ఎస్) కింద కొనుగోలు చేస్తారు. ఈ పథకం కింద కొనుగోళ్లు చేపట్టే ప్రధాన సంస్థలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్). దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించి, స్వావలంబనను బలోపేతం చేసేందుకు మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ కింద 2030–-31 వరకు ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కందులు, మినుములు, మసూర్‌ను కొనుగోలు చేస్తారు.
రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరగడం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు మద్దతుగా ఎంఎస్పీ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తోంది. 2014-–15 నుంచి 2025–-26 మధ్య కాలంలో మొత్తం గోధుమ కొనుగోళ్లు 3,715 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయి. 2004–-05 నుంచి 2013-–14 మధ్య కాలంలో ఇవి 2,254 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. అదే విధంగా ఆయా కాలవ్యవధుల్లో ఆరు రబీ పంటల మొత్తం కొనుగోళ్లు 2,302 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3,921 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి.
మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులకు అండగా నిలవడం, వ్యవసాయ ప్రణాళికలు, పెట్టుబడుల్లో మరింత భరోసా కల్పించడంలో కనీస మద్దతు ధర కీలక సాధనంగా కొనసాగుతోంది. 2027-28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు తీసుకున్న ఎంఎస్పీ నిర్ణయాలు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనపు రాబడిని కొనసాగిస్తున్నాయి. ఈ చర్యలు ధర భరోసా, రాబడి మధ్య సంబంధాన్ని బలపరుస్తున్నాయి.
- ఇస్కా రాజేష్ బాబు
జర్నలిస్ట్
