హైదరాబాద్‌‌‌‌లో ఘనంగా ప్రారంభమైన రెండో భారత్ సమిట్.. 70 దేశాల నుంచి వెయ్యికిపైగా ప్రతినిధుల హాజరు

హైదరాబాద్‌‌‌‌లో ఘనంగా ప్రారంభమైన రెండో భారత్ సమిట్.. 70 దేశాల నుంచి వెయ్యికిపైగా ప్రతినిధుల హాజరు
  • సమన్యాయం, సహకారంతోనే సరికొత్త ప్రపంచం..
  • విభజన రాజకీయాలు, అసమానతలకు ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ
  • సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
  • తొలి రోజు 8 ప్యానెల్ చర్చలు.. హైటెక్స్‌‌‌‌లో తెలంగాణ రైజింగ్‌‌‌‌పై సెషన్లు
  • నేడు జరగనున్న ముగింపు సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక సవాళ్లను ప్రజాస్వామ్య విలువలు, పరస్పర సహకారంతోనే ఎదుర్కోవాలని వివిధ దేశాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. న్యాయం, సహకారంతో సమ్మిళిత ప్రపంచ వ్యవస్థ (ఇన్‌‌‌‌క్లూజివ్ వరల్డ్ ఆర్డర్) నిర్మాణానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండో ఎడిషన్ భారత్ సమిట్ శుక్రవారం హైదరాబాద్ హెచ్‌‌‌‌ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. శనివారం కూడా కొనసాగనున్న ఈ సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యికిపైగా ప్రతినిధులు తరలివచ్చారు.

విభజన రాజకీయాలు, పెరుగుతున్న అసమానతలు, అంతర్జాతీయ సహకారాన్ని దెబ్బతీసే విధానాలకు ప్రత్యామ్నాయంగా జాతీయ సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే ప్రోగ్రెసివ్ విధానాలపై తొలి రోజు విస్తృతంగా చర్చించారు. శనివారం ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

‘ఇండియా అండ్ ది వరల్డ్ ఎక్స్‌‌‌‌పో’ ప్రారంభం

సమిట్‌‌‌‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా అండ్ ది వరల్డ్ ఎక్స్‌‌‌‌పో’ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్‌‌‌‌పోలో తెలంగాణ చేనేత వస్త్రాలు, సంప్రదాయ ఉత్పత్తులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు. దేశ, విదేశీ ప్రతినిధులకు తెలంగాణ ప్రాంతీయ వంటకాలను రుచి చూపించారు. ప్రజాస్వామ్య సంస్థల బలోపేతం, అంతర్జాతీయ సంఘీభావం, ప్రజలే కేంద్రంగా విధానపరమైన ప్రత్యామ్నాయాల రూపకల్పనపై ఉమ్మడి నిబద్ధతను ప్రకటిస్తూ తొలి రోజు సమ్మిట్ ముగిసింది. శనివారం ప్రోగ్రెసివ్‌‌‌‌నెస్, జవాబుదారీతనం, శాంతి, మీడియా భవిష్యత్తు, మారుతున్న ప్రపంచ వ్యవస్థపై చర్చలు జరగనున్నాయి. ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ (ప్రపంచ న్యాయాన్ని అందించడం) వాలిడిక్టరీ సెషన్‌‌‌‌తో సమ్మిట్ ముగుస్తుంది.

అలీన ఉద్యమం కొనసాగుతున్నది: సల్మాన్ ఖుర్షీద్

భారత్ సమిట్‌‌‌‌లో ఏఐ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 8 అంశాలపై ప్యానెల్ చర్చలు జరిగాయి. ‘నావిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్: వ్యూ ఫ్రమ్ ఇండియా’ ప్రారంభ ప్లీనరీకి పుష్పరాజ్ దేశ్‌‌‌‌పాండే మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు, సాంకేతిక అంతరాయాలు, వనరుల పోటీ నెలకొన్నా అలీన ఉద్యమం (నాన్-అలైన్డ్ మూవ్‌‌‌‌మెంట్) కొనసాగుతోందని కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. ‘ఏఐ, క్లౌడ్ క్యాపిటలిజం అండ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్’ సెషన్‌‌‌‌కు సుప్రియా శ్రీనతే మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు.

డేటా మేనేజ్‌‌‌‌మెంట్, కేంద్రీకృత టెక్నాలజీ శక్తి, ఉపాధి, ఎన్నికల ప్రక్రియలు, ఏఐ నియంత్రణపై చర్చించారు. సాంకేతిక ప్రగతి ఫలాలు సామాన్యులకు అందుతూనే ప్రైవసీ, ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధానాలు తీసుకురావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ‘ఎ న్యూ ఎకనామిక్ డీల్ ఫర్ ది వరల్డ్’ సెషన్‌‌‌‌కు దీపేందర్ హుడా మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు, మరింత న్యాయబద్ధమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై చర్చించారు.

నిర్ణయాల్లో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలి

‘యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో’ సెషన్‌‌‌‌లో కృష్ణ అల్లవారు మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. వివిధ దేశాల యువ నేతలు నిర్ణయాత్మక సంస్థల్లో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘సౌత్–సౌత్ కోఆపరేషన్ ఇన్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్’ సెషన్‌‌‌‌కు సప్తగిరి శంకర్ ఉలక మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ నిర్ణయాల్లో గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) గొంతుక మరింత బలంగా వినిపించాలని వక్తలు పిలుపునిచ్చారు. ‘క్లైమేట్ చేంజ్ అండ్ ది ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్’ చర్చకు రాజీవ్ గౌడ మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. క్లైమేట్ జస్టిస్, అడాప్టేషన్, క్లైమేట్ ఫైనాన్స్, పర్యావరణ సవాళ్లతో బలహీన వర్గాలపై పడుతున్న అసమాన ప్రభావాన్ని ప్రస్తావించారు.

వాతావరణ విధానాల్లో అంతర్జాతీయ సహకారం, మానవ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ‘రిఫామ్ ఆఫ్ మల్టీలేటరల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్’ ప్యానెల్‌‌‌‌కు గౌరవ్ గగోయ్ మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. బెర్ట్ కోయెండర్స్, సలీల్ శెట్టి, అలిసన్ మెక్‌‌‌‌మనస్, మరియా జోవో రోడ్రిగ్స్, ఆనంద్ శర్మ పాల్గొన్నారు. పేదరికం, ఇతర ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు బహుళపక్ష అంతర్జాతీయ సంస్థలు మరింత జవాబుదారీతనం, ప్రాతినిధ్యం, సమర్థతతో పనిచేసేలా సంస్కరించాలని పిలుపునిచ్చారు. ‘జెండర్ జస్టిస్ అండ్ ఎ ఫెమినిస్ట్ ఫ్యూచర్’ సెషన్‌‌‌‌కు జోతిమణి సెన్నిమలై మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు. సమానత్వం, లింగ న్యాయం, సమ్మిళిత ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై చర్చించారు.

హైటెక్స్‌‌‌‌లో ‘తెలంగాణ రైజింగ్’ సెషన్లు

అంతర్జాతీయ చర్చలతోపాటు హైటెక్స్‌‌‌‌లో ‘తెలంగాణ రైజింగ్’పై సెషన్లు జరిగాయి. ఫ్యూచర్ సిటీ–పట్టణీకరణ, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం–సంక్షేమ విధానాలపై విస్తృతంగా చర్చించారు. ‘సామాజిక న్యాయం: సమానత్వం, ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం’ ప్యానెల్‌‌‌‌కు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ భంగ్యా భూక్యా మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు.

కుల అసమానతలు, వ్యవస్థాగత మార్పుల అవసరాన్ని విశ్లేషించారు. విద్య, సమానత్వం, అంటరానితనం నిర్మూలన ఆధారంగానే పురోగతిని అంచనా వేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. తెలంగాణ కులగణన సర్వే ప్రాధాన్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

ఆదివాసీ, గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న అడ్డంకులను మంత్రి సీతక్క ప్రస్తావిస్తూ దీర్ఘకాలిక సంస్కరణలకు పిలుపునిచ్చారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని అల్కా లాంబా అన్నారు. ‘సంక్షేమ విధానాలు: విద్య–సాధికారత’ చర్చకు డాక్టర్ ఆరతి కృష్ణ మోడరేటర్‌‌‌‌గా వ్యవహరించారు.

వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్య, ఉపాధి, ఆత్మగౌరవం, ప్రభుత్వ సేవలు సమానంగా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు రూ.21,000 కోట్లతో 2,70,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రణాళికను వివరించారు.