ఏజెన్సీలకు వ్యర్థాల నిర్వహణ.. చికెన్ షాప్ ఓనర్ల ఆందోళన

ఏజెన్సీలకు వ్యర్థాల నిర్వహణ.. చికెన్ షాప్ ఓనర్ల ఆందోళన

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్​కార్పొరేషన్లో చికెన్​ వ్యర్థాల నిర్వహణను ఏజెన్సీలకు అప్పగిస్తే తమ ఉపాధికి నష్టం జరుగుతుందంటూ చికెన్ షాపుల ఓనర్లు ఆందోళనకు దిగారు. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, జనరల్ సెక్రటరీ వరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు శుక్రవారం తార్నాకలోని ఎంఎంసీ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు.

గతంలో చికెన్ వ్యర్థాలను తామే సేకరించి శుద్ధి కేంద్రాలకు తరలించేవారమని, అప్పుడు కిలోకు రూ.4 వరకు చెల్లించేవారన్నారు. ఇప్పుడు టెండర్ల ద్వారా ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తే ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు. వ్యర్థాలకు కిలోకు లేదా నెలవారీగా కొంత మొత్తాన్ని చెల్లించాలని కోరారు. వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, విజిలెన్స్ అధికారి అమృత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను నేరుగా రెండరింగ్ ప్లాంట్లకు తరలించి ప్రాసెస్ చేస్తామని, గతంలో రోడ్లు, చెరువుల్లో వ్యర్థాలు పడేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలిగేదని, కొత్త విధానంతో వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చవచ్చని అన్నారు. వ్యర్థాలను సేకరించి తరలిస్తున్న షాప్ యజమానులకు పరిహారం చెల్లించాలన్న విజ్ఞప్తిని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని, టెండర్ పొందిన ఏజెన్సీలతోనూ చర్చించి వారం రోజుల్లోగా నిర్ణయం తెలియజేస్తామని హామీ ఇచ్చారు.