హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో తాగునీటి వినియోగాన్ని తగ్గించి, శుద్ధి చేసిన మురుగునీటిని పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరో కీలక అడుగు పడింది. నిర్మాణ రంగంలోనూ ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేందుకు శ్రీకారం చుట్టారు. ఎంఎంసీ పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు మూడో దశలో శుద్ధి చేసిన నీటిని అందించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
వాసవి ఆనంద నిలయం నిర్మాణ ప్రాంగణంలో ఎంఎంసీ కమిషనర్ టి వినయ్ కృష్ణారెడ్డి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. శుద్ధి జలాల వినియోగానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థగా వాసవి గ్రూప్ నిలిచింది.
కమిషనర్ మాట్లాడుతూ అన్ని నిర్మాణ సంస్థలు ఈ విధానాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. జలమండలి మల్కాజిగిరి రీజియన్ ఈడీ ఎస్ పంకజ మాట్లాడుతూ నిర్మాణ ప్రాంగణాల్లో కాంక్రీట్ క్యూరింగ్, దుమ్ము నియంత్రణ, శుభ్రపరిచే పనులకు మాత్రమే శుద్ధి జలాలను వినియోగించాలని కోరారు.
వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఎంఎంసీ ఏసీపీలు, జలమండలి డీజీఎంలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జలమండలి డైరెక్టర్ బి.నారాయణ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎంఎంసీ, జలమండలి అధికారులు, వాసవి గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రోజుకు 56 లక్షల లీటర్లు అందుబాటులోకి..
ఎంఎంసీ పరిధిలోని సరూర్‌నగర్, పటేల్ చెరువు ఎస్టీపీల నుంచి 2.50 ఎంఎల్డీ చొప్పున, సఫిల్‌గూడ ఎస్టీపీ నుంచి 0.60 ఎంఎల్డీ శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు కేంద్రాల నుంచి రోజుకు మొత్తం 5.60 ఎంఎల్డీ అంటే 56 లక్షల లీటర్ల నీటిని నిర్మాణ అవసరాలకు వినియోగించుకోవచ్చు. జలమండలి ఈ నీటిని ఉచితంగా అందిస్తుండగా, రవాణా ఖర్చులను మాత్రమే వినియోగదారులు భరించాల్సి ఉంటుంది.
