- నాలుగో వన్డేలో 244 రన్స్ తేడాతో న్యూజిలాండ్ విజయం
- రోహిత్, కోహ్లీ, శ్రేయస్ డకౌట్
మౌంట్ మాంగనుయి: 334 పరుగుల లక్ష్య ఛేదనలో.. రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (0), శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్లు.. ఇన్నింగ్స్‌లో ముగ్గురిది మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు.. ఘోరంగా తేలిపోయిన బౌలర్లు.. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఆట ఇది. ఫలితంగా 244 రన్స్ భారీ తేడాతో ఓడిన ఇండియా... తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి పెద్ద ఓటమి (పరుగుల పరంగా)ని మూటగట్టుకుంది.
విల్ యంగ్ (108 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 125) సూపర్ సెంచరీతో ఆకట్టుకోవడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 333 రన్స్‌కు ఆలౌటైంది. టిమ్ సీఫెర్ట్ (58), ఫిన్ అలెన్ (41) రాణించారు. తర్వాత ఇండియా 26.4 ఓవర్లలో 89 రన్స్‌కే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (27) టాప్ స్కోరర్.
మ్యాట్ హెన్రీ (6/27) సంచలనాత్మక బౌలింగ్ దెబ్బకు టీమిండియా లైనప్ కుదేలైంది. మొత్తానికి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం 2–1కు తగ్గింది. హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే ఇదే వేదికపై జరుగుతుంది. 2000 షార్జాలో ఇండియా 245 రన్స్ తేడాతో శ్రీలంక చేతిలో ఓడటం ఇప్పటి వరకు అతిపెద్ద ఓటమిగా ఉంది. అలాగే వన్డే క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సున్నా రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయిన రెండో జట్టు ఇండియా.
యంగ్ సెంచరీ
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు ఫెయిలయ్యారు. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా కివీస్‌కు కలిసొచ్చాయి. దాంతో ఓపెనర్లు విల్ యంగ్, టిమ్ సీఫెర్డ్ 12 ఓవర్లలోనే 85 రన్స్ జత చేసి శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో సీఫెర్ట్ 41 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేయగా, యంగ్ రెండుసార్లు క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఐదు, ఆరు బాల్స్‌కు కీపర్ ఇషాన్, 5 రన్స్ వద్ద రోహిత్ క్యాచ్‌లు వదిలేశారు.
యంగ్ ఆ తర్వాత వరుస బౌండ్రీలతో హోరెత్తించాడు. నిక్ కెల్లీ (4), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (8) నిరాశపర్చినా.. ఫిన్ అలెన్ ఫర్వాలేదనిపించాడు. నాలుగో వికెట్‌కు 90 రన్స్ జోడించి ఔటయ్యాడు. బ్రాస్‌వెల్ (15)తో ఐదో వికెట్‌కు 41 రన్స్ జత చేసి యంగ్ కూడా వెనుదిరిగాడు. అప్పటికే కివీస్ స్కోరు 256/5కి పెరిగింది. శాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (22), జెమీసన్ (19 నాటౌట్) మెరుగ్గా ఆడటంతో చివరి 10 ఓవర్లలో 68 రన్స్ వచ్చాయి.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 333 ఆలౌట్ (విల్ యంగ్ 125, సీఫెర్ట్ 58, అక్షర్ 2/39).
ఇండియా: 26.4 ఓవర్లలో 89 ఆలౌట్ (ఇషాన్ 29, అక్షర్ 21, హెన్రీ 6/27, ఫిషర్ 3/31).
