ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ ఒకే వేదికపై.. నవంబర్ 19న చైనాలో చారిత్రాక భేటీ!

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ ఒకే వేదికపై.. నవంబర్ 19న చైనాలో చారిత్రాక భేటీ!

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వచ్చే వారం చైనాలోని షెన్‌జెన్‌లో జరగనున్న ఈ అరుదైన భేటీకి సిద్దమవుతున్నట్లు వైట్‌హౌస్ అధికారులు ధృవీకరించారు. నవంబర్ 19న 33వ ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరగనుంది. ఈ ముగ్గురు నేతలు గతంలో వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినప్పటికీ, ఒకేసారి ముగ్గురూ చర్చలు జరపనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

అణ్వాయుధాల నియంత్రణపై చర్చలు..

ఈ త్రైపాక్షిక సమావేశంలో అణ్వాయుధాల నియంత్రణ ప్రధాన అంశంగా ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల విస్తరణ ప్రమాదకరమని భావిస్తున్న ట్రంప్.. అమెరికా, రష్యాలతో పాటు చైనాను కూడా అణ్వాయుధ నియంత్రణ చర్చల్లో భాగస్వామ్యం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  అమెరికా, రష్యా మధ్య కుదిరిన న్యూ స్టార్ట్ అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం 2026 ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో ఇరు దేశాల అణ్వాయుధ నిల్వలపై మరోసారి చర్చకు రానుంది. అమెరికా, రష్యాల దగ్గర 5వేలకు పైగా అణు వార్‌హెడ్‌లు ఉండగా.. చైనా వద్ద 600కు పైగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మూడు దేశాల మధ్య కొత్త ఆయుధ నియంత్రణ ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఇరాన్ యుద్ధంపైనా..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపైనా ముగ్గురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇరాన్‌తో రష్యాకు సైనిక, దౌత్య సంబంధాలు ఉండటంతో ఈ అంశాన్ని సమావేశంలో ప్రస్తావించాలని ట్రంప్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే రష్యా-,ఉక్రెయిన్ యుద్ధంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ వివాదంపై అమెరికా, రష్యాల మధ్య ప్రత్యేక చర్చల ప్రక్రియ కొనసాగుతుంటడంతో అందులో చైనా ప్రత్యక్ష భాగస్వామి కాదని  తెలుస్తోంది. దీంతోపాటు పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా ప్రత్యేక సమావేశం కూడా ఉండబోదని వెల్లడించారు. తన ఆసియా పర్యటనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను కూడా ట్రంప్ కలవడం లేదని అధికారులు తెలిపారు.

సమావేశంపై చైనా, రష్యాల వైఖరి...

వైట్‌హౌస్ ప్రకటనతో త్రైపాక్షిక భేటీ ప్రణాళికలు స్పష్టమైనప్పటికీ, సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలపై చైనా, రష్యాల నుంచి తుది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ భేటీపై గతంలో ఇరు దేశాలు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో తక్షణమే కీలక ఒప్పందం వెలువడే అవకావం తక్కువే అంటున్నారు అమెరికా అధికారులు, అంతర్జాతీయ విశ్లేషకులు. అమెరికా, రష్యాలతో పోలిస్తే అణ్వాయుధ నిల్వలు తక్కువగా ఉన్న క్రమంలో గతంలో త్రైపాక్షిక ఆయుధ నియంత్రణ చర్చల్లో పాల్గొనేందుకు చైనా గతంలో పెద్దగా ఆసక్తి చూపలేదు.

మరోవైపు, ఈ సమావేశంపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ దేశానికి సంబంధించిన అంశాలపై ఉక్రెయిన్ ప్రమేయం లేకుండానే ప్రపంచ అగ్రరాజ్యాల నేతలు చర్చించడం ఆందోళనకరమని ఆ దేశ నేతలు భావిస్తున్నారు. ఈ భేటీ పుతిన్‌కు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందని కూడా ఉక్రెయిన్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.  

ఈ సమావేశంలో అణ్వాయుధ నియంత్రణ, ఇరాన్ యుద్ధం వంటి కీలక అంతర్జాతీయ అంశాలపై  జరగనున్న ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ సమావేశం ప్రపంచ దౌత్య సంబంధాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.