హైదరాబాద్ సిటీలో జరిగిన గిగ్ వర్కర్ల ర్యాలీలో రాహుల్ గాంధీ పాలు పంచుకున్నారు. మహిళా గిగ్ వర్కర్ స్కూటీ డ్రైవ్ చేయగా.. వెనుక కూర్చుని ఆయన ర్యాలీగా వెళుతున్నారు. మరో స్కూటీపై కూర్చుని సీఎం రేవంత్ రెడ్డి కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్య నాయకులు ఈ ర్యాలీలో రాహుల్ వెంట కదిలారు.
గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతే లక్ష్యంగా ఇవాళ (నవంబర్ 14న,శనివారం) హైదరాబాద్లో ర్యాలీ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పకళావేదిక నుంచి హెచ్ఐసీసీ వరకు ర్యాలీకి ప్లాన్ చేశారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లు, కొరియర్ ,ఇతర ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత, ప్రమాద బీమా, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్ వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం ద్వారా అమలు చేయనుంది.
భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించినట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ ర్యాలీ అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు హెచ్ఐసీసీ (HICC) లో భారత్ సమ్మిట్ 2026 (Bharat Summit 2026) ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు.
