కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఒక మంచి ఫ్యామిలీ కథ చేయాలనిపించి.. కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథ రాశా. టీజర్, ‘భజగోవిందం’ పాట అందరికీ నచ్చింది. ఇప్పుడు ‘రుత్తు’ పాట కూడా అందరూ బాగుందని చెప్పడం హ్యాపీ. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.
అలాగే ఈ మూవీలో రఘుకుల తిలక అనే సాంగ్ ఉండనుందనే ప్రచారం పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో రఘుకుల తిలక పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, అది తన వ్యక్తిగత ఎంపిక అని పేర్కొన్నారు. తాను ఆంజనేయ స్వామికి వీరాభిమానినని, అందుకే తన తొలి దర్శకత్వ ప్రయత్నంలో ఈ డివోషనల్ సాంగ్ ఉండాలని బలంగా కోరుకున్నానని కిరణ్ తెలిపారు. రఘుకుల తిలక పాటను ఎప్పుడూ వింటూ ఉంటానని, తన మనసులో దానికి ప్రత్యేక స్థానం ఉందని వివరించారు. ఈ పాటకు మరింత జీవం పోసేందుకు ఒరిజినల్ కంపోజర్‌లు, సింగర్‌లతోనే మళ్లీ పాడించామని, ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Kiran Anna About Raghukula tilaka Song In Reality ❤️ @Kiran_Abbavaram #KiranAbbavaram #Rutthu #Reality #RealityOnDec25 https://t.co/CdanxInNAj
— Actor_KiranAbbavaram (@Actor_KA_) November 13, 2026
ఈ నేపథ్యంలోనే ఇది తన ఫస్ట్ మూవీ వెరీ స్పెషల్ అని హీరోయిన్ దేవిక చెప్పింది. నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ ‘మంచి కుటుంబ విలువలతో కూడిన సినిమా ఇది. 53 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. బిజినెస్ కూడా క్లోజ్ అయింది. గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం’ అని అన్నారు. శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
