శ్రీకాళహస్తి ఆలయం పోటులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే నిఘా భద్రతా వ్యవస్థల నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ భక్తుడు స్పై కెమెరా కలిగిన కంటి అద్దాలతో ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పూణేకి చెందిన అంకేష్ అగర్వాల్, అతని కుటుంబ సభ్యులు శుక్రవారం ( నవంబర్ 13 ) శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కలిసి రూ. 5 వేల రాహు కేతు పూజ జరిపించుకుని దర్శనానికి స్వామివారిని దర్శించుకున్నాక అమ్మవారి గర్భాలయంలోకి ప్రవేశించారు.
ఈ క్రమంలో అంకేష్ అగర్వాల్ వీడియో కెమెరా అమర్చిన కళ్ళజోడు ధరించి ఉండడాన్ని అక్కడ పూజారి గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్వామివారి ఆలయంలో దర్శనమైన తర్వాత అమ్మవారి గుడికి వచ్చారు కనుక స్వామివారి గుడిలో కూడా ఈ వీడియో కెమెరాతో రికార్డు చేశాడా ఆరా తీస్తున్నారు అధికారులు.
