శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి తొలిసారిగా యాత్రికులకు రూ.2 లక్షల జీవిత బీమా(life insurance) సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని బోర్డే చెల్లించనుంది.
శుక్రవారం శబరిమల యాత్ర ఏర్పాట్ల గురించి మాట్లాడిన టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు భక్తులకు కేవలం ప్రమాద బీమా మాత్రమే అందుబాటులో ఉండేదని, ఇప్పుడు జీవిత బీమా సౌకర్యాన్ని కూడా తీసుకొస్తున్నామని తెలిపారు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వర్చువల్ క్యూ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నవారితో పాటు, నేరుగా స్పాట్ బుకింగ్ చేసుకుని వచ్చే భక్తులకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరే ముందు రోజు నుంచి ఈ బీమా అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత మరో మూడు రోజుల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఈ సమయంలో భక్తుడు మరణిస్తే లేదా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించినా కూడా బీమా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జయకుమార్ తెలిపారు.
ఒకవేళ భక్తుడు వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చినా, అతను నిజమైన శబరిమల యాత్రికుడేనని బోర్డు నిర్ధారిస్తే బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పథకానికి బోర్డు ఆమోదం తెలిపిందని, ఎల్ఐసీతో ఒప్పందం సహా మిగిలిన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని వివరించారు.
ఇంటికే అరవాణ ప్రసాదం
భక్తుల సౌకర్యం కోసం మరో కొత్త ఏర్పాటును కూడా టీడీబీ తీసుకొస్తోంది. శబరిమలలో లభించే అరవాణ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా భక్తుల ఇళ్లకే పంపించనున్నారు. దీని కోసం భక్తులు తపాలా కౌంటర్లో చార్జీలు చెల్లించి, వారి ఇంటి అడ్రస్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని వారి ఇంటికే పంపిస్తారు. ఈ సేవకు కొంత అదనపు ఛార్జీ వసూలు చేస్తారు.
నీలక్కల్లో ఏఐ స్మార్ట్ పార్కింగ్
యాత్రికుల వాహనాల రద్దీని తగ్గించేందుకు నీలక్కల్లో ఏఐ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్న 22 పార్కింగ్ ప్రాంతాలను 11 జోన్లుగా ఏర్పాటు చేసి నిర్వహించనున్నారు. పార్కింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో ఏఐ కెమెరాలను అమర్చుతున్నారు. వీటి ద్వారా ఎన్ని వాహనాలు లోపలికి వస్తున్నాయి, ఎన్ని బయటకు వెళ్తున్నాయి అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వాహనాల రాకపోకలను కూడా కంట్రోల్ చేయవచ్చు.
ఈ ప్రాజెక్టు కోసం టీడీబీ, పోలీసులు కలిసి సుమారు రూ.4.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో పోలీసు శాఖ రూ.3.25 కోట్లు, దేవస్వం బోర్డు రూ.1.25 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అలాగే, కోర్టు అనుమతి లభిస్తే చక్కుపాలంలో మరో 300 నుంచి 400 కార్లు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు ఫాస్టాగ్ సదుపాయాన్ని కూడా తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు
యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరికొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చక్కుపాలం పార్కింగ్ ప్రాంతం వరకు టాక్సీలను అనుమతించనున్నారు. చాలక్కాయం నుంచి పంబ నది వరకు రహదారిపై శాశ్వత ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.
అప్పాచిమేడు విశ్రాంతి ప్రాంతాన్ని కొత్త టైల్స్, లైటింగ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. శబరిమల యాత్రకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఎరుమేలి మార్గంలో దారి చూపించే బోర్డులు, వాహనాల వేగాన్ని తగ్గించే రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది శబరిమల యాత్రకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాల కోసం టీడీబీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జీవిత బీమా, ఇంటికే ప్రసాదం పంపించే సదుపాయం, ఏఐ స్మార్ట్ పార్కింగ్ వంటి కొత్త ఏర్పాట్లతో యాత్రను మరింత సులభతరం చేయాలని బోర్డు భావిస్తోంది.
