తెలంగాణలో గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ తీపి కబురు

తెలంగాణలో గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ తీపి కబురు

గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఇకపై మొబైల్ ఫోన్‌లోనే చూసుకోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమంపై హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లకు పెన్షన్, సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి రైడ్, డెలివరీ లావాదేవీపై 1 శాతం నిధులు గిగ్ వర్కర్ల సంక్షేమానికి కేటాయిస్తామని.. కంపెనీలు చెల్లించే 1 శాతం నిధులు వర్కర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు.

గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు పడతాయని, గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఇకపై మొబైల్ ఫోన్‌లోనే చూసుకునే వెసులుబాటు తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రతి నగరంలో ప్రత్యేక రెస్ట్ జోన్లు ఏర్పాటు చేశామని, వై-ఫై సౌకర్యంతో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రెస్ట్ జోన్లలో వాహనాల పార్కింగ్, నిద్రించేందుకు అవకాశం ఉందని చెప్పారు.

తెలంగాణ గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని, గతంలో గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నానని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. 21వ శతాబ్దం డేటా యుగం.. డేటాపైనే ప్రపంచ సంస్థల కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన వివరించారు. ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు తమ పని డేటాపై హక్కు లేదని, ఎన్ని డెలివరీలు చేశారని గానీ, ఎంత సమయం పట్టిందని గానీ, ఎంత ఆదాయం వచ్చిందని గానీ తెలిసేది కాదని చెప్పారు. ‘ఇకపై కష్టం మీది.. డేటా మీది.. హక్కు కూడా మీకే ఉండాలి’ అని గిగ్ వర్కర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంతో డేటాపై వర్కర్లకు పూర్తి అధికారం ఉంటుందని, ప్రతి రైడ్.. ప్రతి డెలివరీ.. ప్రతి లావాదేవీ వివరాలు వర్కర్లకు అందుబాటులోకి వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లకు రక్షణ కల్పిస్తామన్న కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి హామీ అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.