శబరిమల అయ్యప్ప ఆలయానికి నెయ్యి సరఫరా చేసే విషయంలో జరిగిన అక్రమాల కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారులను విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. 2025 శబరిమల యాత్రా సీజన్లో ఆలయానికి పంపాల్సిన నెయ్యిని పక్కదారి పట్టించి విక్రయించారనే ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిని తమిళనాడులోని ఒడ్డంచత్రం ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరన్, కుమారన్గా గుర్తించారు. గురువారం సాయంత్రం విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB) ప్రత్యేక బృందం వీరిని అరెస్టు చేసింది.
విజిలెన్స్ అధికారుల వివరాల ప్రకారం.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB)తో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ ఎస్.ఎస్. బిను, శబరిమల ఆలయానికి పంపాల్సిన మిల్మా నెయ్యిని కొంతమేర పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెయ్యిని కొనుగోలు చేసింది వెంకటేశ్వరన్, కుమారన్లేనని అధికారులు చెబుతున్నారు.
కేరళ సహకార పాల సమాఖ్యకు చెందిన మిల్మా బ్రాండ్ నెయ్యిని గత శబరిమల యాత్రా సీజన్లో శబరిమలకు సరఫరా చేసే బాధ్యతను బినుకు అప్పగించారు. అయితే ఆలయానికి పంపాల్సిన నెయ్యిని శబరిమలకు తీసుకెళ్లకుండా తమిళనాడులోని ఒడ్డంచత్రంలో ఉన్న ఈ ఇద్దరు వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
సుమారు రూ.50 లక్షలకు ఈ నెయ్యిని విక్రయించినట్లు ఆరోపిస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఆ నెయ్యిని శబరిమల ఆలయానికే పంపాల్సి ఉంటుందని తెలిసినా, వ్యాపారులు కొనుగోలు చేశారని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లేకుండా ఉండేందుకు నగదు రూపంలోనే చెల్లింపులు చేసినట్లు ఆరోపించారు.
రూ.2.5 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలు
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ బినును విజిలెన్స్ అధికారులు గతంలోనే అరెస్టు చేశారు. ఆలయానికి పంపాల్సిన సుమారు 11 వేల లీటర్ల నెయ్యిని పక్కదారి పట్టించి, దాని స్థానంలో తక్కువ ధరకు లభించే మరో నెయ్యిని సరఫరా చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వల్ల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సుమారు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
అలాగే, గత శబరిమల యాత్రా సీజన్లో శబరిమల స్టోర్లో సూపర్వైజర్గా పనిచేసిన టీడీబీ ఉద్యోగి జయలాల్ను కూడా విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు.
రికార్డుల్లో ఒకటి.. వాస్తవంగా మరొకటి!
విచారణలో మరో కీలక విషయం బయటపడినట్లు అధికారులు తెలిపారు. శబరిమల వేర్ హౌస్(గోదాం) రికార్డుల్లో ఆలయానికి అవసరమైన మొత్తం నెయ్యి అందినట్లు నమోదు చేశారు. కానీ వాస్తవానికి దారి మళ్లించిన నెయ్యికి బదులుగా పంపిన మరో నెయ్యి కూడా పూర్తిస్థాయిలో ఆలయానికి చేరలేదని గుర్తించారు.
నెయ్యి మొత్తం అందకపోయినా, అందినట్లు రికార్డుల్లో నమోదు చేయడానికి జయలాల్, కాంట్రాక్టర్ బినుకు సహకరించారని విజిలెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల్లో బినుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో టీడీబీ ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం అధికారులు గాలిస్తున్నారు. శబరిమల ఆలయానికి సరఫరా చేసే నెయ్యిలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
