మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ ఆధారంగాఆస్తి పన్ను..ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి 3 కార్పొరేషన్లలో కొత్త విధానం అమలు

మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ ఆధారంగాఆస్తి పన్ను..ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి 3 కార్పొరేషన్లలో కొత్త విధానం అమలు
  • క్యూర్‌‌‌‌‌‌‌‌ చట్టం అమలుకు అధికారుల కసరత్తు
  • నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.75 శాతం పన్ను
  • అక్రమ నిర్మాణాలకు 300 శాతం పెనాల్టీ 
  •  పాత పద్ధతితో పోలిస్తే పలుచోట్ల 50 శాతం వరకు పెరిగే చాన్స్
  •  ఏటా10 శాతం చొప్పున అమలుకు నిర్ణయం
  •  ఆరేళ్లలో పూర్తి పన్ను వసూళ్లను  చేరుకోవాలన్నదే లక్ష్యం

హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–2027) నుంచి ఆస్తి పన్ను వసూళ్లలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న రెంటల్‌‌‌‌‌‌‌‌ వాల్యూ ఆధారిత పన్ను విధానానికి బదులుగా  మార్కెట్‌‌‌‌‌‌‌‌ వాల్యూ ఆధారిత ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత కార్పొరేషన్లలో సిబ్బందికి అధికారులు ప్రత్యేక శిక్షణనిస్తున్నారు.

 కొత్త విధానంలో భవనాల వినియోగాన్ని బట్టి పన్ను శాతాలను నిర్ణయించనున్నారు. నివాస భవనాలకు మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువపై 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.75 శాతం చొప్పున వసూలు చేయనున్నారు. భవన విస్తీర్ణం, భూమి విలువ, నిర్మాణ స్వభావం, వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పన్ను లెక్కించనున్నారు.

 ఇక, అనుమతులు లేకుండా చేపట్టిన భవన నిర్మాణాలు, అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు లేదా విస్తీర్ణం పెంచిన నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. వీటికి సాధారణ ఆస్తి పన్నుతోపాటు 300 శాతం పెనాల్టీ విధించనున్నారు. సంబంధిత ఆస్తి పన్నులు లెక్కించిన తర్వాత అందులో 8 శాతం లైబ్రరీ సెస్ కలెక్ట్ చేయనున్నారు. 

దశలవారీగా అమలు

క్యూర్ చట్టం అమల్లోకి రాకముందు ఉన్న అద్దె విలువ ఆధారిత విధానంతో పోలిస్తే కొత్త మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ విధానంలో కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్ను  దాదాపు 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, యజమానులపై ఒక్కసారిగా భారం పడకుండా దశలవారీగా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళ్లనున్నారు. ఆరేళ్లలో పూర్తి పన్ను వసూళ్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

  జీ+1 భవనానికి వార్షిక పన్ను రూ.13,122 

సాధారణ జీ+1 భవనాన్ని పరిగణలోకి తీసుకుంటే.. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో 1,200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 1,200 చదరపు అడుగులు కలిపి మొత్తం 2,400 చదరపు అడుగుల నిర్మాణం ఉంటే నిర్మాణ వ్యయం, విలువ, అదనపు చార్జీల ఆధారంగా పన్ను లెక్కిస్తారు. ఈ ఉదాహరణలో మొత్తం వార్షిక పన్ను రూ.13,122గా నిర్ధారిస్తారు. 5 కన్నా ఎక్కువ నివాస యూనిట్లు ఉన్న అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ విస్తీర్ణం, కాంపోజిట్‌‌‌‌‌‌‌‌ విలువ ఆధారంగా పన్ను విధిస్తారు.

 1,000 చదరపు అడుగుల ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు చదరపు అడుగుకు రూ.4,600 కాంపోజిట్‌‌‌‌‌‌‌‌ విలువగా తీసుకొని, 0.15 శాతం చొప్పున లెక్కించి, అదనంగా 8 శాతం లైబ్రరీ సెస్  కలిపి వార్షిక పన్నును నిర్ణయిస్తారు. ఈ లెక్క ప్రకారం సదరు ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు ఏడాదికి రూ.7,452 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

షాపు, నివాసానికి వేర్వేరు పన్నులు 

ఒకే భవనంలో వాణిజ్య, నివాస ప్రాంతాలు ఉన్నప్పుడు వాటిని విడివిడిగా పరిగణించి పన్ను లెక్కిస్తారు. ఉదాహరణకు 150 చదరపు గజాల స్థలంలో జీ+1 భవనం నిర్మించి, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపు, మొదటి అంతస్తులో మరో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాసం ఏర్పాటు చేస్తే.. రెండు విభాగాలకు వాటి వినియోగాన్ని బట్టి వేర్వేరుగా పన్ను విధిస్తారు. భూమి విలువను కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం వార్షిక పన్నును రూ.41,317గా లెక్కిస్తారు.