గిరిబాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు..

 గిరిబాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 14న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిరిబాబు మృతిపట్ల సంతాపం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గిరిబాబు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. 

పవన్ సంతాపం

ప్రముఖ నటులుగిరిబాబు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గిరిబాబు  విభిన్నమైన పాత్రలు పోషించారు. చక్కటి హాస్యం కూడా పండించారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారు.  గిరిబాబు కుమారుడు, నటుడురఘుబాబుకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

►ALSO READ | ఐదు దశాబ్దాలు..600లకు పైగా సినిమాలు..గిరిబాబు సినీ ప్రస్థానం ఇదే..!

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు గిరిబాబు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది. గిరిబాబు మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.