తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గిరిబాబు చివరి సినిమా ఇదే!

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గిరిబాబు చివరి సినిమా ఇదే!

Giri Babu Death: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలక్షణమైన పాత్రలతో అలరించిన సీనియర్ యాక్టర్ గిరిబాబు ఇక లేరు. ఆయన ఇవాళ (2026, నవంబర్ 14, శనివారం) కన్నుమూశారు. 1973లో జగమే మాయ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి సుమారు 600కు పైగా మూవీల్లో నటించారు. ఆయన కుమారుడు రఘుబాబు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గిరిబాబు మరణ వార్త విని సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా టూ మద్రాస్: 

గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు.. ఆయన 1946 జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలోని ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే కళారంగం, నాటకాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ రంగం వైపు నడిచారు. ఎన్నో కలలతో అవకాశాల కోసం మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నగరానికి వెళ్లి అనేక కష్టాలు పడ్డారు. ఇక 1973లో వచ్చిన 'జగమే మాయ' మూవీతో విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన ఫస్ట్ సినిమాతోనే నటుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు గిరిబాబు.

600కు పైగా సినిమాల్లో నటించిన గిరిబాబు: 

తన కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో మెప్పించిన గిరిబాబు, ఆ తర్వాత రోజుల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా విభిన్న పాత్రల్లో నటించాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సుమారు 600కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఏ పాత్ర ఇచ్చినా తన సహజ నటనతో దానికి ప్రాణం పోసేవారు గిరిబాబు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ అప్పటి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

నిర్మాతగా, దర్శకుడిగా గిరిబాబు తనదైన మార్క్: 

గిరిబాబు కేవలం నటుడు మాత్రమే కాదు.. నిర్మాతగా, దర్శకుడిగా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. నిర్మాతగా మారి దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపు దాడి లాంటి విజయవంతమైన మూవీలను నిర్మించారు. అలాగే డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టి రణరంగం, ఇంద్రజీత్, నీ సుఖమే నే కోరుకున్నా వంటి సినిమాలకు డైరెక్షన్ వహించి తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు.

►ALSO READ | ఐదు దశాబ్దాలు..600లకు పైగా సినిమాలు..గిరిబాబు సినీ ప్రస్థానం ఇదే..!

వారసుడిగా వచ్చిన రఘుబాబు: 

గిరిబాబు సతీమణి శ్రీదేవి 2016లో మూత్రపిండాల వ్యాధితో చనిపోయింది. ఈ దంపతులకు రఘుబాబు, బోసుబాబు అనే ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు మాధవి ఉంది. తండ్రి అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన రఘుబాబు.. దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో అగ్ర హాస్యనటుల్లో ఒకరిగా ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గిరిబాబు చివరి సినిమా ఇదే: 

గిరిబాబు నటించి విడుదలైన లాస్ట్ సినిమా 2023లో వచ్చిన అన్నీ మంచి శకునములే.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.