అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగింది: రాహుల్ గాంధీ

అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగింది: రాహుల్ గాంధీ

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యాపారం, రాజకీయం కలిసిపోయాయని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగిందని వ్యాఖ్యానించారు. అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగిందన్నారు. దేశంలోని కీలక రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని 600 మంది సంపన్నుల్లో ఒకరిగా ఉన్న అదానీ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా ఎలా మారారు? ఇది ఎలా సాధ్యమైంది? వ్యాపారం, రాజకీయం కలిసిపోయాయి .అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగింది" అని వ్యాఖ్యానించారు.

అన్ని రంగాల్లో అదానీదే ఆధిపత్యం

విమానాశ్రయాలు, పోర్టులు, రక్షణ రంగం, బ్రిడ్జిలు, సిమెంట్, మౌలిక సదుపాయాలు ఇలా అనేక రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇన్ని కీలక రంగాల్లో ఒకే పారిశ్రామికవేత్త వ్యాపారాలు విస్తరించడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు.దీని ఫలితంగా బీజేపీ ఆస్తులు పెరిగాయని, ఆ పార్టీకి వేల కోట్ల రూపాయల నిధులు సమకూరాయని ఆరోపించారు. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని విమర్శించారు.

►ALSO READ | లాయర్లు పంపిన ఫేక్ కోర్టు ఆర్డర్ నమ్మి వెబ్‌సైట్లు బ్లాక్ చేసిన అధికారులు..!

దేశంలోని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. మీడియా, సోషల్ మీడియాలో 24 గంటలూ ప్రధాని మోదీనే కనిపిస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు.దేశంలోని వ్యవస్థలను కబ్జా చేశారని ఆరోపించారు. తనపై 45 కేసులు పెట్టారని, వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయని అన్నారు.

ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు బలహీనపడటం వల్లే దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం దీనికి భిన్నంగా ఉంటుందని వివరించారు.దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉండేలా చూడటమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వినాలని, వారి అవసరాలకు అనుగుణంగా పాలన సాగాలని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు.