ఇంతకీ ఇది టెస్టా? టీ20నా?.. బాయ్స్, గర్ల్స్ కలిసి ఆడే సరికొత్త గేమ్.. రూల్స్ చూస్తే మైండ్ బ్లాకే!

ఇంతకీ ఇది టెస్టా? టీ20నా?.. బాయ్స్, గర్ల్స్ కలిసి ఆడే సరికొత్త గేమ్.. రూల్స్ చూస్తే మైండ్ బ్లాకే!

Test Twenty Cricket: టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇప్పటి వరకు క్రికెట్ ప్రపంచంలో మనం చూసిన మూడు ఫార్మాట్లు ఇవే.. కానీ ఇప్పుడు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. టెస్ట్ క్రికెట్ వ్యూహాలు, టీ20 మెరుపులను కలగలిపి టెస్ట్ టీ20 (Test Twenty) పేరుతో ఒక వినూత్న మిక్స్‌డ్-జెండర్ (బాయ్స్ & గర్ల్స్) క్రికెట్ ఫార్మాట్‌ను శ్రీలంకలోని కొలంబోలో నవంబర్ 13, శుక్రవారం నాడు అధికారికంగా ప్రారంభించారు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్, విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ సమక్షంలో ఈ సరికొత్త టోర్నీ లాంచ్ అయింది.

అసలేంటి ఈ టెస్ట్ ట్వంటీ.. మైండ్ బ్లాక్ చేసే రూల్స్: 

* ఒక్క రోజులోనే టెస్ట్, టీ20 మజా: ఈ ఫార్మాట్‌లో మొత్తం 80 ఓవర్లు, 4 ఇన్నింగ్స్‌లు ఉంటాయి. ప్రతి జట్టుకు 20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి. తొలి ఇన్నింగ్స్ స్కోర్లను రెండో ఇన్నింగ్స్‌కు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. విశేషమేమిటంటే.. ఈ నాలుగు ఇన్నింగ్స్‌ల మ్యాచ్ కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. 

* బాయ్స్, గర్ల్స్ కలిసి ఆడే మ్యాచ్: ప్రతి ఫ్రాంచైజీ తరఫున ఒక బాయ్స్ XI, ఒక గర్ల్స్ XI జట్లు బరిలోకి దిగుతాయి. 13 నుంచి 21 ఏళ్ల వయసున్న యువ క్రికెటర్లు 'పారిటీ రూల్' (Parity Rule) కింద ఆడతారు. ఈ రెండు జట్లు వేర్వేరుగా 40 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడతాయి. అయితే, బాయ్స్, గర్ల్స్ జట్ల ఉమ్మడి స్కోరు (Combined Performance) ఆధారంగానే మ్యాచ్ ఫలితం, పాయింట్ల పట్టికలో స్థానం ఖరారవుతాయి. 

* డ్రా, ఫాలో-ఆన్, సూపర్ ఓవర్: టెస్ట్ క్రికెట్ తరహాలోనే ఇందులో ఫాలో-ఆన్ (Follow-on) నిబంధన కూడా ఉంది. మ్యాచ్ గెలుపు, ఓటమి, టై లేదా డ్రాగా ముగియవచ్చు. నాలుగో ఇన్నింగ్స్ ఆడే జట్టు చివరి బంతి వరకు నాలుగు కంటే ఎక్కువ వికెట్లు కోల్పోకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. ఒకవేళ స్కోర్లు సమమైతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

►ALSO READ | భారత బ్యాటర్లను భయపెట్టిన ఆ బౌలర్ ఐదో వన్డే ఆడట్లేదోచ్!

టోర్నీ షెడ్యూల్:

ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్ మద్దతు: ఈ టోర్నీ అడ్వైజరీ బోర్డులో మాథ్యూ హెడెన్‌తో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్, వెస్టిండీస్ లెజెండ్ సర్ క్లైవ్ లాయిడ్ ఉన్నారు. యువ ఆటగాళ్లకు ఒత్తిడిని తట్టుకుని ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక అని హెడెన్ కొనియాడారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఫార్మాట్‌కు భవిష్యత్తులో ఎంతో ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

4 కాంటినెంటల్ జట్లు 10 మ్యాచ్‌లు: ప్రారంభ సీజన్‌లో సౌత్ ఆసియా, ఆస్ట్రేలాసియా, యూరప్, సబ్-సహారన్ ఆఫ్రికా అనే నాలుగు కాంటినెంటల్ ఫ్రాంచైజీలు తలపడుతున్నాయి. ఈరోజు (నవంబర్ 14, శనివారం) సబ్-సహారన్ ఆఫ్రికా vs ఆస్ట్రేలాసియా మ్యాచ్‌తో ఈ టోర్నీ మొదలైంది. రౌండ్-రాబిన్ లీగ్, క్వాలిఫయర్లు, ఎలిమినేటర్ తర్వాత నవంబర్ 29వ తేదీన ఫైనల్ జరగనుంది.