ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం: రాహుల్ గాంధీ

ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం: రాహుల్ గాంధీ

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ఫాసిస్టు విధానాలు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రావాల్సిన కొందరు దేశవిదేశ ప్రతినిధులను మోడీ సర్కార్ కావాలనే అడ్డుకుందని చెప్పారు. మోడీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడి సదస్సుకు రాలేకపోయిన అతిథులకు క్షమాపణలు తెలిపారు రాహుల్ గాంధీ.

2014 నాటి ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా జరిగాయని రాహుల్ అన్నారు. వందల కోట్లు కుమ్మరించి కొత్త డ్రామా క్యాంపెయిన్ నడిపించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అప్పట్లో ఈ పరిణామాలు ప్రతిపక్షాలను షాక్‌కు గురిచేశాయని.. నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో కేవలం భయపెట్టే వాతావరణమే కొనసాగుతోందని విమర్శించారు. గత పదేళ్లుగా దేశంలో రన్నింగ్, రౌంపింగ్, జంపింగ్, షౌటింగ్, స్క్రీమింగ్ పెరిగిపోయిందని.. దేశ ప్రజలను నిరంతరం కన్ఫ్యూజన్‌కు గురిచేస్తున్నారని బీజేపీ కుట్రలను ఎద్దేవా చేశారు.

ఇక 2024 ఎన్నికలపై సంచలన ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికల్లో ఏకంగా కోట్లాది మంది ఓటర్లను తొలగించారని అన్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో ఏకంగా 13 శాతం ఓట్లను జాబితా నుంచి మాయం చేశారని ఎన్నికల తీరుపై తీవ్ర సందేహాలు లేవనెత్తారు. ప్రజలను భయపెడుతూ, ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సాగుతున్న ఈ పాలన దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు రాహుల్.

ప్రపంచంలో ప్రధానంగా 2 రకాల మనుషులుంటారని రాహుల్ అన్నారు. అన్నీ తమకే తెలుసు అనుకునే వారు కొందరైతే.. అందరి మాట వింటూ నేర్చుకునే వారు మరికొందరని చెప్పారు. రాజకీయాల్లో అన్నీ తమకే తెలుసని, తామే దేవుళ్లమని భావించే వారే ‘ఫాసిస్టులు’ అని అభివర్ణించారు. వ్యవస్థలు కుప్పకూలినప్పుడు మాత్రమే ఇలాంటి ఫాసిస్టులు బయటకు వస్తారని.. వారు ఎవరి మాట వినకుండా కేవలం అరుస్తుంటారని విమర్శించారు.

ALSO READ : అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగింది

మెజారిటీ ప్రజలు ఎప్పుడూ వినయంతో ఉంటారని, ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారని రాహుల్ చెప్పారు. అయితే కొందరి స్వార్థ రాజకీయాల వల్ల దేశంలో అశాంతి నెలకొందని, ప్రస్తుతం దేశంలో ఈ రెండు విభిన్న భావజాలాల మధ్యే అసలైన పోరాటం జరుగుతోందని స్పష్టం చేశారు. దేశ ప్రజల హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలని హైదరాబాదులో పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ ఒంటెద్దు పోకడులు, మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఏపక్ష నిర్ణయాల వల్లనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దీనిపై భయపడకుండా ప్రజలు గళం విప్పాలని సూచించారు రాహుల్ గాంధీ.