అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. జల్సా బంగ్లాపై మరదలు ఫిర్యాదు!

అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. జల్సా బంగ్లాపై మరదలు ఫిర్యాదు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. ముంబైలోని జుహూలో ఉన్న ఆయన నివాసం ‘జల్సా’ బంగ్లా యాజమాన్యంపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది . 1993లో ఈ బంగ్లాను జయా బచ్చన్‌కు బహుమతిగా బదిలీ చేసినట్లు పేర్కొంటున్న గిఫ్ట్ డీడ్‌ను అమితాబ్ బచ్చన్ తమ్ముడి భార్య రమోలా బచ్చన్ సవాల్ చేశారు. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండానే ఆస్తి బదిలీ జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ తమ్ముడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా గత ఏడు నెలలుగా ఆస్తి రిజిస్ట్రేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. జల్సా బంగ్లా మొదట తన పేరు మీదే రిజిస్టర్ అయిందని, అనంతరం గిఫ్ట్ డీడ్ ద్వారా జయా బచ్చన్ పేరు మీదకు మార్చారని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదు అంధేరిలోని డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయానికి చేరడంతో విచారణ ప్రారంభమైంది.

1993 గిఫ్ట్ డీడ్‌పై అభ్యంతరాలు

జల్సా బంగ్లా యాజమాన్యానికి సంబంధించి కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జయా బచ్చన్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ కార్డులో మాత్రం ఇప్పటికీ రమోలా పేరు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును తొలగించి జయా బచ్చన్ పేరు చేర్చేందుకు ప్రయత్నాలు జరగడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

1993లో రూపొందించిన గిఫ్ట్ డీడ్ చెల్లుబాటుపైనా రమోలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ పత్రాన్ని స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా సాధారణ కాగితంపై తయారు చేశారని, సాక్షుల సంతకాలు కూడా లేవని ఆమె తన ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం ఆ పత్రాన్ని ఎలా రిజిస్టర్ చేశారు? మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభయ్ యోజన పథకం కింద దానిని ఎలా క్రమబద్ధీకరించారు? అనే అంశాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ ఫిర్యాదుపై డిప్యూటీ రిజిస్ట్రార్ ఫైయాజ్ ములానీ స్పందిస్తూ.. ఫిర్యాదు అందిందని, విచారణ ప్రారంభించామని తెలిపారు. సంబంధిత పక్షాలు తమ వివరణలు సమర్పించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై అమితాబ్ బచ్చన్ స్పందించలేదని, జయా బచ్చన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. . అభిషేక్ బచ్చన్ ప్రతినిధి మాత్రం ఇది కుటుంబ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ పత్రాల చెల్లుబాటు, ఆస్తి యాజమాన్యంపై అధికారులు ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

ALSO READ : ట్రైలర్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా ధనుష్ ‘ఓం’..

అభిమానులతో అమితాబ్ బచ్చన్ సండే దర్శన్

మరోవైపు, జల్సా బంగ్లా బయట అభిమానులను కలుసుకునే తన సుదీర్ఘ సంప్రదాయాన్ని అమితాబ్ బచ్చన్ కొనసాగిస్తున్నారు. నవంబర్ 8న ఆదివారం అభిమానులను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గత ఆదివారం అభిమానులను కలిసినప్పుడు ఉపయోగించిన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను ఈసారి ఏర్పాటు చేయలేదు.