ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జర్మనిలోని తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించింది. జర్మనీలో తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. జర్మనీలోని కొత్త ప్లాంట్లలోకొత్తగా పెట్టుబడులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మెర్సిడెజ బెంజ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
జర్మనీలో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, కార్మికుల వేతనాల వంటి సమస్యలతో మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యం–యూనియన్లతో చర్చలు జరపగా విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. జర్మనీలోని ప్లాంట్లలో కొత్త పెట్టుబడులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తెలిపిందని రాయిటర్స్ కథనాలు చెబుతున్నాయి. కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గకపోతే రెండు ప్లాంట్లు మూతపడే పరిస్థితి ఉందని ఉద్యోగులను హెచ్చరించింది. ప్లాంట్లు మూసివేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జర్మనీకి చెందిన అతిపెద్ద కార్మిక సంఘం ఐజీ మెటల్ (IG Metall) ప్రస్తుత వేతనాలపై ఐదు శాతం పెంపును కోరుతోంది. దీంతో యాజమాన్యం, యూనియన్ల మధ్య చర్చలు కీలకంగా మారాయి.
ఇదే సమయంలో జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కూడా ఖర్చుల తగ్గింపుపై యూనియన్లతో చర్చలు జరుపుతోంది. నాలుగు ప్లాంట్ల మూసివేత, సుమారు లక్ష ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది చివర్లో సమ్మెలు జరిగే అవకాశం కూడా ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభం వాహన తయారీ సంస్థలకే పరిమితం కాలేదు. విడిభాగాల తయారీ సంస్థ షెఫ్లర్ (Schaeffler) కూడా యూరప్‌లో ఐదు యూనిట్లను మూసివేస్తూ 3వేల460 ఉద్యోగాలను తొలగించినట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గడం కూడా ఈ పరిణామాలకు కారణమని కంపెనీ తెలిపింది. జర్మనీలో తాజాపరిణామాలు ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
