మన ఇళ్లలో, గుళ్లలో చూస్తున్న వెంకటేశ్వరస్వామి చిత్రపటాలను గీసిన పెద్దాయన ఇక లేరు !

మన ఇళ్లలో, గుళ్లలో చూస్తున్న వెంకటేశ్వరస్వామి చిత్రపటాలను గీసిన పెద్దాయన ఇక లేరు !

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ రూపాన్ని తన కుంచెతో అద్భుతంగా ఆవిష్కరించి, లక్షలాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్‌ కన్నుమూశారు. వయోభారంతో పాటు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా 86 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.

శ్రీవారి రూపాన్ని చిత్రకళ ద్వారా భక్తులకు మరింత చేరువ చేసిన కళాకారుడి మరణవార్త కళాభిమానులను, స్వామివారి భక్తులను విషాదంలో ముంచింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన శ్రీనివాసన్‌కు చిన్నతనం నుంచే చిత్రకళపై ఆసక్తి ఉండేది. పదో తరగతి వరకు చదువుకున్న ఆయన, ఆ తర్వాత చిత్రకళనే తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు.

ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు దగ్గర చిత్రలేఖనంలో మెళకువలు నేర్చుకున్నారు. గురువు దగ్గర పొందిన శిక్షణ, నిరంతర సాధన ఆయనను ప్రతిభావంతుడైన చిత్రకారుడిగా తీర్చిదిద్దాయి. ఈ క్రమంలోనే 1970లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆహ్వానం మేరకు శ్రీనివాసన్‌ తిరుమలకు వచ్చారు. ఈ పర్యటన ఆయన కళాజీవితంలోనే కాకుండా, శ్రీవారి చిత్రరూపాల చరిత్రలోనూ ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయింది. గర్భాలయంలో స్వామివారిని దర్శించి.. కుంచెతో దివ్యరూపం చిత్రించారు.

ఈ రూపమే మన ఇళ్లలో, గుళ్లలో వెంకటేశ్వర స్వామి పటాలుగా మనం నిత్యం చూస్తున్నాం. శ్రీవారిని రెండు విభిన్న రూపాల్లో చిత్రీకరించడం ఆయన కళా ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆభరణాలతో అలంకరించిన స్వామివారి రూపంతో పాటు, ఆభరణాలు లేని రూపాన్ని కూడా ఆయన తన కుంచెతో ఆవిష్కరించారు. ఈ రెండు చిత్రాలూ భక్తుల్లో విశేష ఆదరణ పొందాయి.