టెక్నాలజీ వాడకం అంటే ఇలా ఉండాలి.. AI పుణ్యమా అని 2 ఏళ్ల తర్వాత ఫ్యామిలీ ఒక్కటైంది!

టెక్నాలజీ వాడకం అంటే ఇలా ఉండాలి.. AI పుణ్యమా అని 2 ఏళ్ల తర్వాత ఫ్యామిలీ ఒక్కటైంది!

మనిషి ఎంత దూరం ప్రయాణించినా.. కాలం ఎంత కరిగిపోయినా కన్నవారికీ, కంటికి రెప్పలా చూసుకునే భర్తకూ దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం. మహారాష్ట్రలో మానసిక క్షోభతో ఇంటి నుంచి దూరమైన ఒక నిస్సహాయ మహిళ సుమారు రెండున్నరేళ్ల తర్వాత తన కుటుంబ సభ్యుల కౌగిలికి చేరిన ఆనందకరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంకేతికతను సరిగ్గా వినియోగిస్తే ఎంతటి అద్భుతాలనైనా సాధించవచ్చని ఇది మరోసారి నిరూపించింది.

మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల జులేఖా ముఖీద్ షేక్ గతంలో మానసిక సమస్యల కారణంగా తన ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయారు. కుర్లా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కొలాబా పోలీసులు, చెంబూర్ ప్రభుత్వ మహిళా అధికారుల సహకారంతో ఆమెను 2024 ఏప్రిల్ 3న సింధుదుర్గ్‌లోని 'సన్విత ఆశ్రమ్'లో చేర్చారు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఆశ్రయం పొందుతూ వస్తోంది. ఆమె కుటుంబం ఎక్కడ ఉందనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులకు ఆమెను కుటుంబ సభ్యులతో చేర్చడం సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో జీవన్ ఆనంద్ సంస్థ ట్రస్టీ కిసాన్ చౌరే, ఆయన టీం జులేఖాతో ఎంతో ఓపికగా తరచూ మాట్లాడసాగారు. ఆమె చెప్పిన చిన్న చిన్న వివరాలు, గుర్తులను సేకరించి AI సాధనమైన చాట్‌జీపీటీ, గూగుల్ సెర్చ్ వంటి డిజిటల్ టూల్స్‌ను ఉపయోగించి ఆమె స్వస్థలాన్ని గుర్తించేందుకు శ్రమించారు. ఈ డిజిటల్ అన్వేషణ ఫలించి ఆమె సొంతూరు పర్భణీ అని తేలింది. వెంటనే పర్భణీలోని నిర్భయ పోలీస్ స్క్వాడ్ సహకారంతో ఆమె బంధువులను సంప్రదించడంలో ఆశ్రమ టీం విజయవంతమైంది.

రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన జులేఖా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమాచారం అందుకున్న ఆమె భర్త ముఖీద్ షేక్ నవంబర్ 9న సన్విత ఆశ్రమానికి వచ్చి ఆమెను స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఓపికతో కూడిన సంభాషణలు, నేటి అధునాతన ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక కుటుంబం కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తెచ్చిన ఆశ్రమ నిర్వాహకుల కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.