నిర్మలా సీతారామన్ AI వీడియోతో ట్రేడింగ్ మోసం.. రూ.49 లక్షలు పోగొట్టుకున్న మహిళ

నిర్మలా సీతారామన్ AI వీడియోతో ట్రేడింగ్ మోసం.. రూ.49 లక్షలు పోగొట్టుకున్న మహిళ

సోషల్ మీడియాలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలు అమాయక ప్రజల ప్రాణాలను, వారు కష్టపడి సంపాదించిన డబ్బును క్షణాల్లో హారతి కర్పూరంలా కరిగించేస్తున్నాయి. తాజాగా కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఒక సంఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక ఫేక్ వీడియోను నమ్మి కేరళకు చెందిన 45 ఏళ్ల మహిళ ఏకంగా రూ.49 లక్షలు పోగొట్టుకోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుందాం రండి..

కోజికోడ్‌ జిల్లాలోని తామరశేరి మైక్కావు ప్రాంతానికి చెందిన మహిళకు ఫేస్‌బుక్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడిన ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందవచ్చని మంత్రి స్వయంగా చెబుతున్నట్లుగా డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి మోసగాళ్లు సృష్టించారు. దానిని నిజమని నమ్మిన ఆ మహిళ.. వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి మోసగాళ్ల ఉచ్చులో పడిపోయింది. ఈ ఏడాది జూలై 15 నుంచి సెప్టెంబర్ 22 మధ్య కాలంలో తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పుతుప్పాడి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాల నుంచి నిందితులు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా మొత్తం రూ.49 లక్షల 20వేలను ట్రాన్స్‌ఫర్ చేసింది.

ఎంతో ఆశతో పెట్టిన పెట్టుబడికి ఎలాంటి లాభాలు రాకపోగా, పెట్టిన అసలు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కోజికోడ్ రూరల్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ట్రాక్ చేస్తున్నామని, వాటిని ఫ్రీజ్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. AIతో తయారు చేసిన ఇలాంటి ఫేక్ ప్రకటనలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ యూనిట్ గతంలోనే స్పష్టతనిచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎటువంటి పెట్టుబడి పథకాలను ఆమోదించలేదని.. ఆమె పేరుతో ప్రమోట్ చేస్తున్న వీడియోలు మోసపూరితమైనవని హెచ్చరించారు. 

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి ఆర్థిక ప్రకటనలు, పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ డీప్ ఫేక్ వీడియోలతో సెలబ్రిటీల ముఖాలను, వాయిస్ లను వక్రీకరించి సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న ఈ తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.